పరీక్షలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (CBSE) కీలక ప్రకటన చేసింది. ఇకపై విద్యార్థులకు 75 శాతం అటెండెన్స్ ఉంటేనే పరీక్షలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఫలితాల వెల్లడికి ఇంటర్నేషనల్ అసైన్‌మెంట్ (International Assignment) తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే, హాజరు శాతం తక్కువగా ఉంటే అసైన్‌మెంట్స్ సాధ్యం కావడం లేదని బోర్డు తాజాగా వెల్లడించింది. దీంతో ప్రతి విద్యార్థికి ఎట్టి పరిస్థితుల్లో 75 శాతం అటెండెన్స్ తప్పసరి నిబంధన అమలు చేయాలని తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది.
ఇక ఇటీవలే స్కూళ్లలో భద్రతపై సీబీఎస్ఈ (CBSE) కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రతి పాఠశాలలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. కనీసం 15 రోజుల ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా తప్పనిసరిగా కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎంట్రీ, ఎగ్జిట్ రూట్లతో పాటు పాఠశాల పరిధిలో అన్ని చోట్ల కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఆడియో, వీడియో రికార్డయ్యేలా కెమెరాలు ఉండాలని తెలిపింది.
































