బీకానేర్: ‘‘కాలం కలిసొస్తే పాము కరిచినా బతకొచ్చు.. కలిసిరాకపోతే చెప్పు కరిచినా పోవచ్చు’’ అంటారు. రాజస్థాన్‌లోని బీకానేర్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తే ఎవరైనా ‘నిజమే సుమా!’ అంటారు. అయిదుగురు వ్యక్తులు ఎస్‌యూవీలో నాగౌర్ నుంచి బీకానేర్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో ఓ మూలమలుపు వద్ద కారు అదుపు తప్పింది. క్షణాల్లో ఎనిమిది పల్టీలు కొట్టి ఓ కార్ల షోరూం గేటుపై బోల్తాపడింది. సీసీ టీవీ ఫుటేజీ ప్రకారం.. అతి భయానకంగా జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్న అయిదుగురూ చిన్నగాయం కూడా కాకుండా క్షేమంగా బయటపడటం విశేషం. కారు పల్టీలు కొడుతున్న సమయంలో ఒకరిద్దరు బయటకు దూకేశారు. అంతేనా.. ప్రమాదం అనంతరం పక్కనున్న కార్ల షోరూం లోపలికి నడుచుకొంటూ వెళ్లి.. ‘‘మాకు కొంచెం టీ ఇస్తారా?’’ అని అక్కడున్న సిబ్బందిని అడిగారు. ‘చాయ్ మాత్రమే ఏమిటీ!.. భూమ్మీద మీకింకా చాలా నూకలు మిగిలి ఉన్నాయి’ అనిపించక మానదు కదూ!