2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఆదాయపు పన్ను శాఖ శుభవార్త ప్రకటించింది. సెక్షన్ 87A పన్ను మినహాయింపు అర్హత ఉన్న పన్ను చెల్లింపుదారులకు క్లెయిమ్ చేయడానికి తాజాగా అవకాశం లభించింది.
ఈ ప్రకటన డిసెంబర్ 31, 2024న ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన పన్ను చెల్లింపుదారులు సవరించిన లేదా ఆలస్యమైన ITRను ఫైల్ చేసి 87A పన్ను మినహాయింపును పొందవచ్చు.
87A పన్ను మినహాయింపు అంటే ఏంటి
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87A ప్రకారం, అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానంలో రూ. 12,500 వరకు, కొత్త పన్ను విధానంలో రూ. 25,000 వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ఈ మినహాయింపు పన్ను చెల్లింపుదారుల పన్ను బాధ్యతను తగ్గించడంతో పాటు, కొన్ని సందర్భాల్లో సున్నా అయ్యే అవకాశాన్ని కూడా ఇస్తుంది.
ITR ఫారమ్‌లలో మార్పులు:
ఈ సేవను అందించడానికి, ఆదాయపు పన్ను శాఖ ITR ఫారమ్‌లను సవరించింది. ముఖ్యంగా ITR-2, ITR-3 ఫారమ్‌లకు సంబంధించిన యుటిలిటీలను అప్‌డేట్ చేసింది. డిసెంబర్ 31, 2024 నాటికి విడుదలైన సర్క్యూలర్ నంబర్ 21 ప్రకారం, ఈ కొత్త మార్పులు 2024 డిసెంబరు 31నుంచి అమలులోకి వస్తాయి. 87A పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసే ఎంపికను సమర్ధంగా అమలు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ వీటిని అప్‌డేట్ చేసింది.
ఆలస్యమైన ITR దాఖలు:
ఈ మార్పుల ప్రకారం, అర్హులైన పన్ను చెల్లింపుదారులు సవరించిన లేదా ఆలస్యమైన ITRను ఫైల్ చేసుకోవచ్చు. ముందుగా పన్ను చెల్లింపుదారులు 87A పన్ను మినహాయింపును పొందేందుకు అనుమతించబడిన సందర్భాల్లో మాత్రమే ITR ఫైల్ చేయగలుగుతారు. ఇప్పుడు సవరించిన లేదా ఆలస్యమైన ITR ఫైల్ చేయడం ద్వారా వారు ఈ మినహాయింపును పొందవచ్చు.
హైకోర్టు మధ్యంతర నిర్ణయం:
ఈ కొత్త అవకాశం బొంబాయి హైకోర్టు మధ్యంతర నిర్ణయానికి అనుగుణంగా అమల్లోకి రావడం విశేషం. గతంలో పన్ను చెల్లింపుదారులు 87A మినహాయింపు క్లెయిమ్ చేయడానికి అర్హత కలిగిన సమయంలో మాత్రమే ITR ఫైల్ చేయగలుగుతారు. కానీ బొంబాయి హైకోర్టు దృష్టికి వచ్చిన ఈ అంశంతో ఈ ప్రకటన విడుదలైంది. దీనికి అనుగుణంగా ఆదాయ పన్ను శాఖ 87A పన్ను మినహాయింపు పొందేందుకు సవరించిన లేదా ఆలస్యమైన ITR దాఖలు చేయడానికి గడువు పొడిగించాలని నిర్ణయించింది.
మార్పులు:
ఈ మార్పులతో పన్ను చెల్లింపుదారులు ITR-2, ITR-3 ఫారమ్‌లు మాత్రమే ఫైల్ చేయగలుగుతారు. వీటి ద్వారా మూలధన లాభాల ఆదాయాన్ని పన్ను చెల్లింపులో చూపించవచ్చు. చార్టర్డ్ అకౌంటెంట్లు ఈ మార్పులకు సంబంధించి, పన్ను చెల్లింపుదారులు 87A పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయడం కోసం ఆన్‌లైన్ ITR పోర్టల్‌ను వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ తాజా నిర్ణయంతో 87A పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసే పన్ను చెల్లింపుదారులకు పన్ను మినహాయింపు పొందే మంచి ఛాన్స్ వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరం కోసం ఆర్ధిక శాఖ మరింత పన్ను చెల్లింపుదారులకు ఈ అవకాశాన్ని అందిస్తోంది. ఇది వారి మొత్తం పన్ను బాధ్యతను తగ్గించడంలో సహాయపడుతుంది.