ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం: జీతాలు ఎంత పెరుగుతాయి?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) త్వరలో రానుంది. ఈ వేతన సంఘం జీతాలు, పెన్షన్లు, భత్యాలను భారీగా సవరించే అవకాశం ఉంది. దీని ద్వారా దాదాపు 30-34% వరకు జీతాల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వేతన సవరణలను ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’ ఆధారంగా చేస్తారు. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను నిర్ణయించేటప్పుడు ద్రవ్యోల్బణం, ఉద్యోగుల అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.


వేతన సంఘాలు అమలులోకి వచ్చినప్పుడు ద్రవ్యోల్బణం ఎలా ఉంది, జీతాలు ఎలా మారాయో ఒకసారి చూద్దాం.

5వ వేతన సంఘం (1997)

5వ వేతన సంఘం 1997లో అమలులోకి వచ్చింది. అప్పుడు సగటు ద్రవ్యోల్బణం రేటు 7% ఉంది. ఉద్యోగుల కనీస వేతనం నెలకు రూ. 2,550గా నిర్ణయించారు. ద్రవ్యోల్బణం పెరగడంతో ఈ జీతాలు సరిపోలేదు.

6వ వేతన సంఘం (2008)

6వ వేతన సంఘం 2008లో అమలులోకి వచ్చినప్పుడు, ద్రవ్యోల్బణం రేటు 8-10% మధ్య ఉంది. ఈ సంఘం కనీస నెల జీతాన్ని రూ. 7,000గా నిర్ణయించింది. ఇది అంతకు ముందు వేతన సంఘం కంటే రూ. 4,450 పెరిగింది. ఈ సంఘం ద్వారా జీతాల నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పే బ్యాండ్‌లు, గ్రేడ్ పే వంటి వాటిని ప్రవేశపెట్టడం వల్ల జీతాలు గణనీయంగా పెరిగాయి.

7వ వేతన సంఘం (2016)

7వ వేతన సంఘం 2016లో అమలులోకి వచ్చింది. ఆ సమయంలో ద్రవ్యోల్బణం రేటు 5-6%గా ఉంది. కనీస జీతం రూ. 18,000గా నిర్ణయించారు. ఇది గత సంఘం కంటే రూ. 11,000 ఎక్కువ. ఈ సంఘంలో ‘పే మ్యాట్రిక్స్’ అనే కొత్త విధానం ప్రవేశపెట్టారు. దీనివల్ల పింఛను సూత్రాలు మెరుగుపడ్డాయి. అలాగే, ఉద్యోగుల పని-జీవిత సమతుల్యత (work-life balance) గురించి కూడా చర్చలు జరిగాయి.

8వ వేతన సంఘం నుంచి ఏం ఆశించవచ్చు?

8వ వేతన సంఘం 2026లో అమలులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అప్పుడు ద్రవ్యోల్బణం రేటు 6-7% మధ్య ఉంటుందని భావిస్తున్నారు. యాంబిట్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం, 8వ వేతన సంఘం కింద 30-34% వరకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొత్త జీతాల పెంపు ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ఉంటుంది. ఇంకా వివిధ పోస్టులకు న్యాయమైన వేతనాలను అందించే లక్ష్యంతో ఇది ఉంటుందని మింట్ నివేదించింది.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నిర్మాణం

ప్రభుత్వ ఉద్యోగి జీతంలో బేసిక్ పే (basic pay), కరువు భత్యం (dearness allowance – DA), ఇంటి అద్దె భత్యం (house rent allowance – HRA), రవాణా భత్యం (transport allowance) ఉంటాయి. ఒక నివేదిక ప్రకారం, ఉద్యోగుల మొత్తం ఆదాయంలో బేసిక్ శాలరీ 51.5% ఉంటుంది. డీఏ దాదాపు 30.9%గా, హెచ్‌ఆర్‌ఏ సుమారు 15.4%గా, ప్రయాణ భత్యం 2.2%గా ఉంటుందని నివేదిక పేర్కొంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.