మర్డర్ కేసులో హీరో దర్శన్ తూగుదీప అరెస్ట్ కావడం కన్నడనాట కలకలం రేపింది. తన ప్రియురాలు ప్రవిత్రా గౌడను ఇబ్బందిపెట్టిన రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేయించాడనే ఆరోపణలతో దర్శన్ జైలుపాలయ్యాడు.
భార్యను పట్టించుకోకుండా ప్రియురాలి కోసం ఇంతకు తెగించాడనే వాస్తవాన్ని అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రవిత్రా గౌడ మాయలో పడి ఇంతదాకా తెచ్చుకున్నాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మిగతా నిందితులతో పాటు వీరిద్దరూ కూడా ఇప్పుడు బెంగళూరు జైల్లో ఉన్నారు.
ఎవరీ ప్రవిత్రా గౌడ?
పవిత్ర గౌడ కన్నడ నటి. సినిమాలు, టెలివిజన్ తో పాటు మోడల్ గానూ పనిచేశారు. ఆమె చత్రిగలు సార్ చత్రిగలు, అగమ్య, ప్రీతి కితాబు సినిమాల్లో నటించారు. 2016లో వచ్చిన 54321 సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఖుషీ టీవీ షోతో పాపులయ్యారు. నటనకు దూరమయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్‌లోకి ప్రవేశించారు. రెడ్ కార్పెట్ స్టూడియో 777 పేరుతో బోటిక్‌ని నిర్వహిస్తున్నారు. జనవరి 24న సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపింది. దర్శన్ తో తాను కలిసివున్న ఫొటోలతో రూపొందించిన ఈ వీడియోను షేర్ చేసి.. పదేళ్ల మా అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ప్రకటించడంతో వీరి వ్యవహారం బహిర్గతమైంది.
పవిత్రను రెండో పెళ్లి చేసుకున్న దర్శన్?
జగ్గు దాదా సినిమా సమయంలో దర్శన్ పవిత్ర గౌడకు కలిశారని.. ఆడిషన్‌కి వెళ్లినప్పుడు ఒకరికొకరు పరిచయం అయ్యారని తెలుస్తోంది. అక్కడి నుంచి వీరిద్దరూ దగ్గరయ్యారని, పవిత్రను దర్శన్ రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని కూడా వార్తలు వచ్చారు. అయితే పవిత్రకు కూడా అంతకుముందే పెళ్లై కూతురు ఉంది. 18 ఏళ్ల వయసులో సంజయ్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత వీరిద్దరూ విడిపోయారు. దర్శన్ తో పరిచయం తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. అయితే పవిత్ర తన కాపురంలో చిచ్చు పెట్టిందని దర్శన్ భార్య విజయలక్ష్మి పలుమార్లు వాపోయారు.
రేణుకాస్వామిని ఎందుకు చంపారు?
చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన రేణుకాస్వామికి హీరో దర్శన్ అంటే అభిమానం. తాను అభిమానించే హీరో భార్యను పట్టించుకోకుండా ప్రియురాలి మాయలో పడిపోవడం అతడు జీర్ణించుకోలేకపోయాడు. దర్శన్ కాపురంలో చిచ్చు పెట్టిన పవిత్రా గౌడపై కోపం పెంచుకుని ఆమెను బద్నాం చేయాలనుకున్నాడు. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు. పవిత్రను తిడుతూ అసభ్య మెసేజ్ లు, ఫొటోలతో ఆమెను విసిగించాడు. అతడి అకౌంట్ ను బ్లాక్ చేసినా ఆగడాలు ఆగకపోవడంతో ఆమె దర్శన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
బెల్టుతో బాది, గొడకేసి కొట్టి..
తన ప్రియురాలిని ఇబ్బంది పెడుతున్న రేణుకాస్వామిని హత్య చేయడానికి ఒక గ్యాంగ్ తో రూ.30 లక్షలకు దర్శన్ డీల్ కుదుర్చుకున్నట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. పథకంలో భాగంగా రేణుకాస్వామిని రాత్రి సమయంలో చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్ క్లబ్ కన్వీనర్ రాఘవేంద్ర ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి.. దర్శన్ దగ్గరకు తీసుకుపోయాడు. అప్పటితో కిరాయి మనుషులతో రెడీ ఉన్న దర్శన్.. రేణుకాస్వామిని చూడగానే ఆగ్రహంతో ఊగిపోయాడు. బెల్టుతో బాది, గొడకేసి కొట్టి అతడిని చంపేశారు. తర్వాత శవాన్ని డ్రైనేజీలో పారేశారు. ముందుగా కుదుర్చున్న ఒప్పందం ప్రకారం ముగ్గురు నిందితులు అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. డబ్బుల గొడవ కారణంగా రేణుకాస్వామిని తామే హత్యచేసినట్టు పోలీసులతో చెప్పారు. వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించి మొత్తం కూపీ లాగడంతో కుట్ర బయటపడింది. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు 6 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. దర్శన్, పవిత్ర కార్లను పోలీసులు సీజ్ చేశారు.
రేణుకాస్వామి చంపినట్టుగానే..
రేణుకాస్వామి అంత్యక్రియలు బుధవారం చిత్రదుర్గలో జరిగాయి. రేణుకాస్వామి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడిని పాశవికంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రేణుకాస్వామి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమ కొడుకుని చంపినట్టుగానే హీరో దర్శన్ ను చంపాలంటూ వారు నినదించారు. 3 నెలల గర్భవతిగా ఉన్న రేణుకాస్వామి భార్య సహన శోకసంద్రంలో మునిగిపోయింది. దర్శన్ ను పిచ్చిగా అభిమానించడమే తన భర్త చేసిన పాపమా అంటూ ఆమె రోదించింది. తన భర్తను చంపినట్టుగానే దర్శన్ ను చంపాలని వేడుకుంది.