విశాఖపట్నం: విశాఖలో రుషికొండపై నిర్మించిన భవనాలు జగన్ కోసం కాదు అంటూనే.. ఒకవేళ అధికారంలోకి వచ్చి ఉంటే అక్కడి నుంచే జగన్ పాలన చేసేవారంటూ మాజీమంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రుషికొండ భవనాలను మొదటి నుంచి పర్యాటక ప్రాజెక్టు అనే చెప్పామన్నారు. విశాఖ నుంచి పాలన జరిగితే రుషికొండ భవనాలు బాగుంటాయని ఐఏఎస్‌ల కమిటీ.. నివేదిక ఇచ్చిందని తెలిపారు. రూ. 450 కోట్లతో ఎందుకంత విలాసవంతంగా నిర్మించారని విలేకరులు ప్రశ్నించగా ‘2014-19 మధ్య అమరావతిలో తాత్కాలిక భవనాలకు చంద్రబాబు చదరపు గజానికి రూ.10 వేల చొప్పున రూ. 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. రుషికొండలో వైకాపా శాశ్వత నిర్మాణాలను చేపట్టింది’ అంటూ అమర్‌నాథ్ చెప్పుకొచ్చారు. భవనంలోని ఫర్నిచర్ ధరలను కూటమి నేతలే ఫిక్స్ చేసి మైకుల ముందు ఊదరగొడుతున్నారన్నారు. విశాఖలో మంచి ప్రభుత్వ గెస్ట్‌హౌస్ లేదు కనుక నగరానికి రాష్ట్రపతి, గవర్నరు వంటివారు వచ్చినప్పుడు విడిది కోసం ఈ భవనాలు నిర్మించామంటూ మరో కొత్త రాగం అందుకోవడం గమనార్హం.
ముందే తెలిస్తే ఆ 11 సీట్లూ వచ్చేవి కావు: గంటా
రుషికొండ రహస్యం ఎన్నికలకు ముందే వెల్లడై ఉంటే వైకాపాకు ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కావని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎక్స్ వేదికగా చురకలంటించారు. ‘రుషికొండ నిర్మాణాలపై ఎందుకీ కుప్పిగంతులు? మొదట టూరిజం ప్రాజెక్టు అన్నారు. తర్వాత ఫైవ్‌స్టార్ హోటల్, సీఎం క్యాంపు కార్యాలయం అన్నారు. రాష్ట్రపతి, గవర్నర్‌లు బస చేయడానికి ఐఎన్‌ఎస్ డేగ, నేవల్ గెస్ట్‌హౌస్ వంటివి ఉన్నాయి’ అని గంటా గుర్తుచేశారు. సరైన అనుమతుల్లేవని ప్రజావేదిక కూల్చినవాళ్లు.. అనేక అభ్యంతరాలున్న రుషికొండ భవనాన్ని ఏం చేయాలో చెప్పాలి’ అని గంటా పేర్కొన్నారు.
ఆ విలాసాల ఖర్చుతో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయొచ్చు: ఎంపీ కలిశెట్టి
రుషికొండపై రాజసౌధాల కోసం ఖర్చు చేసిన నిధులను ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెచ్చించి ఉంటే ప్రజలు హర్షించేవారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. జగన్ విలాసాల కోసం ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేయడం ఎంతవరకు హర్షణీయమని ప్రశ్నించారు. ‘ఆ ప్యాలెస్‌ల కోసం రూ.450 కోట్లు ఖర్చు చేశారు. ఆ నిధులతో ఉత్తరాంధ్రలో ఎన్నో ప్రాజెక్టులను పూర్తిచేసి ఉండొచ్చు’ అని అప్పలనాయుడు పేర్కొన్నారు.