Chhatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్‌కు ఛత్రపతి శివాజీ రహస్య ఆయుధం

www.mannamweb.com


ముంబయి: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ (Chhatrapati Shivaji Maharaj) ఉపయోగించిన రహస్య ఆయుధం ‘వాఘ్‌ నఖ్‌’ (wagh Nakh) (పులి పంజా Tiger Claw) 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరింది. బుల్లెట్‌ప్రూఫ్‌ కవర్‌లో, భారీ సెక్యూరిటీ మధ్య దీన్ని మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం భారత్‌కు తీసుకొచ్చింది. సతారా (Satara)లోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో దీన్ని ఉంచారు. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde), డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) ఇతర నాయకులు తరలివచ్చారు. సతారాలో ఏడు నెలల పాటు ‘వాఘ్‌ నఖ్‌’ను ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇన్నాళ్లుగా లండన్‌లోని అల్బర్ట్‌ మూజియంలో ఈ ఆయుధం ఉంది. ప్రజలకు చూపించాలని సంకల్పించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన మూడేళ్ల పాటు ఉంచుకునేందుకు ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.

చరిత్ర ప్రకారం.. 1649లో ఛత్రపతి శివాజీ బీజాపుర్‌ సుల్తాన్‌ను ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు బీజాపుర్‌ సేనాధిపతి అఫ్జల్‌ ఖాన్‌తో సమావేశమైన శివాజీ రహస్యంగా దాచుకున్న ఈ వాఘ్‌ నఖ్‌ను ఉపయోగించి అతడిని అంతమొందించాడు. ఈ ఘటన ప్రతాప్‌గఢ్‌ కోటలో జరిగింది. ఇది ప్రస్తుతం సతారాలో ఉంది. అందుకే ఈ ఆయుధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చింది.

ఇక ఈ ఏడాది చివరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే శివసేన (శిందే వర్గం)కు ఈ అంశం ఎన్నికల్లో కలిసివస్తుందని నేతలు భావిస్తున్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే వారసత్వాన్ని తామే ముందుకు తీసుకెళుతున్నట్లు సీఎం ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గం భావిస్తున్న వేళ.. శివాజీ చిహ్నమైన ఈ ఆయుధం తమ విశ్వసనీయతను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంటున్నారు.