124 ఏళ్ల నాటి రికార్డు సమం చేసిన మను బాకర్.. ఈ ఘనత సాధించిన ఆ ఇండియన్ ఒలింపియన్ ఎవరో తెలుసా

www.mannamweb.com


Manu Bhaker: ఇండియన్ షూటర్ మను బాకర్ 124 ఏళ్ల కిందట ఒలింపిక్స్ లో నమోదైన రికార్డును సమం చేసింది. 1900లో జరిగిన తొలి ఒలింపిక్స్ లో అప్పటి బ్రిటీష్ ఇండియా తరఫున కోల్‌కతాకు చెందిన నార్మన్ ప్రిచార్డ్ కూడా ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచాడు.

ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ మను బాకర్ అని మనకు తెలుసు. అయితే ఇది స్వతంత్ర భారతదేశంలో. స్వతంత్రం రాక ముందు 1900లో ఇదే పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో బాయ్ ఆఫ్ కలకత్తాగా పేరుగాంచిన నార్మన్ ప్రిచార్డ్ కూడా రెండు మెడల్స్ గెలిచాడు. మను రెండూ బ్రాంజ్ మెడల్స్ గెలవగా.. ప్రిచార్డ్ రెండూ సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకున్నాడు.

1900లో ఇదే పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో ప్రిచార్డ్ 200 మీటర్ల హర్డిల్స్, 200 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్లలో సిల్వర్ మెడల్స్ గెలిచాడు. స్వతంత్రానికి ముందు ఒలింపిక్స్ లో ఇండియా గెలిచిన తొలి మెడల్ ఇదే.

ఇప్పుడు మను బాకర్ ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా నిలిచింది. స్వతంత్ర భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్ ఆమెనే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో ఆమె మెడల్స్ గెలిచింది. ఈ రెండూ బ్రాంజ్ మెడల్సే కావడం విశేషం.

మను బాకర్ అప్పటి ప్రిచార్డ్ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పారిస్ ఒలింపిక్స్ లో ఆమె 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనే పాల్గొంటోంది. అందులోనూ మెడల్ గెలిస్తే.. ఒకే ఒలింపిక్స్ లో మూడు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అవుతుంది.

మను బాకర్ 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో సరబ్‌జ్యోత్ సింగ్ తో కలిసి బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఈ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో కొరియా టీమ్ పై 16-10 తేడాతో ఇండియన్ జోడీ విజయం సాధించింది.