ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్ష హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ వాయుగుండంగా మారింది.
ఇది రేపటికి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. దీంతో ఈ తుఫాను ప్రభావం ఏపీపై పడనుంది. ఏపీ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈ నెల 26, 27, 28, 29 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం దక్షిణ, ఉత్తర కోస్తాలో ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర ఎక్కువగా ప్రభావితం అవుతుందని పేర్కొంది.
ప్రస్తుతం వాయుగుండం పరిస్థితి ఇదే
ప్రస్తుతానికి వాయుగుండం ట్రింకోమలీకి 600 కిమీ, నాగపట్నానికి 880 కిమీ,పుదుచ్చేరికి 980 కిమీ మరియు చెన్నైకి ఆగ్నేయంగా 1050 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుంది .ఆ తర్వాత వచ్చే 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా … అలెర్ట్
రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
దక్షిణ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో కేంద్రీకృతమైన వాయుగుండంగా గడిచిన 3గంటల్లోనే 30కిమీ వేగంతో కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనున్నట్లు వివరించారు.
ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక
తాజా హెచ్చరికల నేపధ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు. దక్షిణకోస్తా తీరం వెంబడి రేపు గంటకు 50-70కిమీ, ఎల్లుండి నుంచి 55 -75కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఈ నేపధ్యంలో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
రానున్న నాలుగు రోజులు వర్షాలే
వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు.