30 వేల కిలోమీటర్లు ఒక్క మలుపు కూడా లేకుండా 14 దేశాలను కలిపే రోడ్డు

రోడ్డు అంటే మలుపులు, వంకలు సహజం. మన దేశంలో వందల కిలోమీటర్ల పొడవు ఉండే నేషనల్ హైవేస్‌ ఎన్నో రాష్ట్రాలను కలుపుతూ వెళ్తాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి వెళ్లే రహదారులపై టర్నింగ్స్, క్రాసింగ్స్ మరీ ఎక్కువగా ఉంటాయి.
కానీ 30,000 కిలోమీటర్ల పొడవున్న ఓ రోడ్డుపై మాత్రం అలాంటివేమీ లేవంటే నమ్ముతారా? ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డుగా ఇది గుర్తింపు సాధించింది. ఇంతకీ అది ఎక్కడ ఉంది, దాని విశేషాలేంటో చూద్దాం.


* 14 దేశాల మీదుగా..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డు పాన్‌-అమెరికన్‌ హైవే (Pan-American Highway). దీని పొడవు 19 వేల మైళ్లు, అంటే దాదాపు 30,577 కిలోమీటర్లు. ఇది మొత్తం 14 దేశాల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ లిస్టులో అమెరికా, కెనడా, మెక్సికో, గ్వాటిమాలా, ఎల్‌ సాల్వెడార్‌, హోండురస్‌, నికరాగువా, కోస్టారికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, చిలీ, అర్జెంటీనా ఉన్నాయి.
30వేల కిలో మీటర్ల వరకు నో టర్న్..
ఈ రోడ్డు అలస్కాలోని ప్రుధో బే దగ్గర ప్రారంభమై అర్జెంటీనాలోని ఉషుయా వద్ద ఎండ్ అవుతుంది. దారి పొడవునా అందమైన ప్రదేశాలను చూడవచ్చు. దట్టమైన అడవుల్లో అరుదైన జంతుజాతులు కనిపిస్తాయి. అలస్కాలోని ఆర్టిటిక్‌ టండ్రాలు, సెంట్రల్‌ అమెరికాలోని దట్టమైన మడ అడవులతో పాటు పెరూలోని ఎడారి, అర్జెంటీనా దక్షిణ భాగంలో రఫ్‌ ఉండే భూభాగం వరకు ఓ వింత అనుభూతిని ఇస్తుంది. ఈ రోడ్డు రెండు అమెరికా ఖండాల విశిష్టతలు, సంస్కృతి, సంప్రదాయాలను కలిపే వారధి. అక్కడి పురాతన గ్రామీణ సంప్రదాయాలతో పాటు ఆధునిక నగరాల సంస్కృతిని కళ్లకు కడుతుంది. వలస పాలన నాటి చరిత్రను పరిచయం చేస్తుంది.

* ఒక్క చోట మాత్రం..
ఈ రోడ్డు పొడవునా ఎక్కడా అడ్డంకులు ఉండవు. భారీ మలుపులు, వంకలు, యూ టర్న్‌లు అసలే కనిపించవు. అయితే, పనామా, కొలంబియా మధ్య ఉండే దట్టమైన అడవి దగ్గర దాదాపు 160 కిలోమీటర్ల పొడవు మాత్రం రోడ్డు అర్ధాంతరంగా ముగిసినట్లు కనిపిస్తుంది. దీన్ని ‘డేరియన్‌ గ్యాప్‌’గా వ్యవహరిస్తారు. పర్యావరణం సహా లాజిస్టికల్‌ కారణాల వల్ల అక్కడ ఫెర్రీల వంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ.. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డుగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

* పెద్ద సాహసమే
మలుపులు, వంకలు లేనంత మాత్రాన ఏకధాటిగా హాయిగా ప్రయాణించవచ్చు అనుకుంటే పొరపాటే. ఈ రోడ్డుపై ప్రయాణించడం పెద్ద సాహసమే. ఎందుకంటే కొన్ని చోట్ల అత్యంత కఠిన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఎత్తైన కొండల్లో ప్రయాణించాల్సి వస్తుంది. కొన్నిచోట్ల వందల కిలోమీటర్ల వరకు ఎలాంటి సదుపాయాలు ఉండవు. ఆండీస్‌ పర్వత శ్రేణుల్లో కొంత మంది ‘ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌’ సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మారుమూల ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు సరిపడా ఫ్యూయల్ ఉండేలా చూసుకోవాలి. అయితే, సాహస యాత్రలు చేసే వారికి మాత్రం ఇవన్నీ ఛాలెంజింగ్‌గా అనిపిస్తాయి.

* ఎన్నో వింతలు
సాహస యాత్రలు, కొత్త ప్రాంతాలను అన్వేషించే వారికి ఈ పాన్‌ అమెరికా హైవేపై (Pan-American Highway) ప్రయాణం కొత్త అనుభూతులను మిగులుస్తుంది. కెనడాలోని బన్ఫ్‌ నేషనల్‌ పార్క్‌ నుంచి కోస్టారికా రెయిన్‌ఫారెస్ట్‌లు, పటగోనియా మంచుపర్వతాలు మరో లోకంలోకి తీసుకెళ్తాయి. అదే సమయంలో మెక్సికో టాకోల నుంచి అర్జెంటీనా మాల్బెక్‌ వైన్‌ వరకు అనేక ఫుడ్‌ ట్రెడిషన్స్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు.

వరల్డ్ బిగ్గెస్ట్ హైవే..
ఈ హైవే వివిధ దేశాల ఐక్యత, ఉమ్మడి చరిత్రకు ప్రతీకగా నిలుస్తోంది. దేశాలు, పర్యావరణ వ్యవస్థలు, ప్రజలను ఒకచోట చేర్చి రెండు అమెరికా ఖండాల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తోంది. ఈ అద్భుత ప్రయాణం.. జీవితాంతం నిలిచి ఉండే జ్ఞాపకాలను అందిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.