Chilukuru Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి ఇంట్లో అసలేం జరిగింది?

డాలర్ స్వామిగా గుర్తింపు పొంది ప్రఖ్యాతిగాంచిన చిలుకూరు బాలాజీ ఆలయంలో ఘోర అపచారం జరిగిందా? ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇంటిపై ఎందుకు దాడి చేశారా?


ఆయనను ఏం అడిగారు? దాడికి బాధ్యులెవరు? అన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై కదలిక వచ్చింది.

అసలేం జరిగిందంటే?
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇంటికి దాదాపు 20 మంది వచ్చారు. తాము రామరాజ్యం కోసం పాటుపడుతున్నామని, రామరాజ్యం సంస్థంలో చేరి తమతో కలిసి రావాలని, ఆలయ బాధ్యతలను తమ రామరాజ్యం సంస్థకు అప్పగించాలని, మీ వద్ద ఉన్న భక్తులను తమ కమిటీలో సభ్యులుగా చేర్చాలని ఒత్తిడి చేశారు. దీంతో దానికి రంగరాజన్ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర పదాలతో ఆయనపై వీరరాఘవ అనే వ్యక్తి విరుచుకుపడ్డాడు. ఆ సమయంలో వీడియో తీస్తూ రికార్డ్ చేశారు.

దాడి సమయంలో వీరరాఘవ, ఆయన అనుచరుల వేధింపుల కారణంగా రంగరాజన్‌ కన్నీరు కారుస్తున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. రంగరాజన్‌పై దాడి చేసిన తర్వాత వీడియో రికార్డు చేసినట్టు తెలుస్తున్నది. రంగరాజన్ నేలపై కింద కూర్చొని ఉండగా, కుర్చీలపై వీరరాఘవ, ఆయన అనుచరులు ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. రంగరాజన్ దుఃఖభారంతో కన్నీటిని తుడుకుంటుండగా, వారు హెచ్చరికలతో మాట్లాడుతూ వేధింపులకు దిగినట్టు కనిపిస్తున్నది.

తన కుమారుడిపై కొందరు దుండగులు దాడి చేశారని రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులు ఆలస్యం కావడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ బాధ్యతలు అప్పగించి, తమతో కలిసి రావాలని దుండగులు తన కుమారిడిపై దాడి చేశారని ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

ఏపీలోని అనపర్తికి చెందిన వీరరాఘవ ఏపీ, తెలంగాణలోని వివిధ ఆలయాలకు వెళ్తున్నట్టు వెలుగులోకి వస్తున్నది. రామరాజ్యం పేరిట సైన్యం తయారు చేస్తున్నట్టు సమాచారం. రాఘవ బృందం వివిధ ఆలయాలకు వెళ్లి బెదిరింపులకు దిగుతున్నట్టు పోలీసుల విచారణలో తెలుస్తున్నట్టు సమాచారం. ఇటీవలే విజయవా, కోటప్పకొండ ఆలయాలకు వెళ్లినట్టు విచారణ తేలిందని తెలిసింది. 2015లో హైదరాబాద్ అబిడ్స్‌లో వీరరాఘవపై కేసు నమోదైనట్టు తెలిసింది.

ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడి ఘటన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్‌, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రంగరాజన్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.

చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌కు కేటీఆర్ పరామర్శ
చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌ను ఆలయ ఆవరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం పరామర్శించారు. ఆయనతోపాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వీరరాఘవ నేతృత్వంలోని రామరాజ్యం సైన్యం సభ్యులు ఇటీవల రంగరాజన్‌పై దాడి ఘటన విషయం తెలిసిన కేటీఆర్‌ను ఇప్పటికే ఫోన్‌లో పరామర్శించారు. తాజాగా స్వయంగా కలిసి ఆయనను పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి చర్యలు తీసుకునేదాకా తాము అండగా ఉంటామని రంగరాజన్‌కు భరోసా కల్పించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.