భారతదేశంలో ప్రస్తుతం లక్షల్లో వేతనాలు పొందుతున్న వ్యక్తులు సైతం ప్రస్తుతం ఉద్యోగాలు మానేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తమకు ఉన్న కలలను నెరవేర్చుకోవటానికి సొంతంగా నచ్చిన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు.
మనస్సులోని ప్రేరణతో చేసే పనుల నుంచి ఆత్మ సంతృప్తిని అందుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కేరళకు చెందిన బ్యాంక్ ఉద్యోగి అజయ్ గోపీనాథ్ సక్సెస్ స్టోరీ గురించే. ఏటా లక్షల మంది పోటీపడుతున్న బ్యాంక్ ఉద్యోగంతో స్థిరమైన రాబడిని అందుకుంటున్నప్పటికీ అజయ్ జాబ్ మానేశాడు. ఈ క్రమంలోనే తాను సొంతంగా ఏదైనా చేయాలనే దృఢ నిశ్చయంతో అలెప్పీకి చెందిన అజయ్ 2017లో మైక్రోగ్రీన్స్ ఫార్మింగ్ ప్రారంభించాడు. ప్రజలకు తన ఉత్పత్తుల ద్వారా తాజా, ఆరోగ్యకరమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడు.
మైక్రోగ్రీన్స్ అని పిలువబడే ఈ మొక్కలను విత్తిన 7 రోజుల్లోనే కోయవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే కాకుండా శరీరంలో కొవ్వులను తగ్గిస్తాయి. అందుకే వీటికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ప్రస్తుతం దేశంలో వీటిని కొని తింటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇది తెలుసుకున్న గోపీనాథ్ తన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలివేసి మైక్రోగ్రీన్స్ వ్యవసాయం ప్రారంభించాడు. బ్యాంకు ఉద్యోగిగా దాదాపు 14 ఏళ్లు పనిచేసిన అజయ్ బెంగళూరులో ఒక రెస్టారెంటుకు వెళ్లినప్పుడు మెుదటిసారి మైక్రోగ్రీన్స్ సలాడ్ చూశాడు. అప్పుడు వాటి గురించి తెలుసుకోవటం ప్రారంభించాడు. పెద్దగా ఇబ్బంది లేకుండా ఇంటివద్దే వీటిని పెంచవచ్చని తెలుసుకున్నాడు.
మైక్రోగ్రీన్స్ సాగు పద్ధతిని అధ్యయనం చేస్తున్నప్పుడు బ్రిటన్‌లోని ఈ వ్యాపారంలో ఉన్న కొంతమంది రైతులను సంప్రదించాడు. వారి నుంచి మైక్రోగ్రీన్స్ పెంపకంపై అనేక అంశాలను అడిగి తెలుసుకున్నాడు. కొంత సమాచారం సేకరించిన తర్వాత ఇంట్లో ఒక గదిలో చిన్న స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించాడు. ఈ క్రమంలో దాదాపు రెండేళ్లు గ్రౌండ్ వర్క్ చేయటం గమనార్హం. మెుదట్లో వీటిని తన స్నేహితులకు ఇచ్చేవాడు.
ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో పనిచేసే అజయ్ స్నేహితుడు అక్కడి చెఫ్‌కి దీని గురించి చెప్పటంతో వాటిని ఆహారంలో ఉపయోగించడం ప్రారంభించారు. దీని తర్వాత అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. ముందుకు సాగుతూ అజయ్ కిరో గ్రీన్ స్టోర్ అనే దుకాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం మైక్రోగ్రీన్స్ పెంపకం ద్వారా నెలకు రూ.3.5 లక్షలు సంపాదిస్తున్నాడు. స్వయం ఉపాధితో పాటు క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడానికి ప్రజలకు వీటి ద్వారా సహాయం చేస్తున్నాడు.