“గులియన్ బారే సిండ్రోమ్..” ఇంతవరకూ తెలుగు రాష్ట్రాలకు పరిచయమే లేని ఈ పేరు..ఇప్పుడు ప్రజలను వణికిస్తోంది. ఇప్పుటికే తెలంగాణలో ఒకరిని బలితీసుకున్న ఈ వ్యాధి..ప్రస్తుతం ఏపీలోనూ మరొకరిని బలి తీసుకుంది. ఇక వరుసగా నమోదవుతున్న కేసులు..అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఒక పక్క జీబీఎస్.. మరో పక్క బర్డ్ ఫ్లూ.. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భయాందోళన నెలకొంది.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.. గులియన్ బారే సిండ్రోమ్ తో.. ఇప్పటికే సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల మహిళ..ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఇప్పుడు తాజాగా జీబీఎస్ వైరస్ తో ఆంధ్రప్రదేశ్ లో మరో మహిళ మరణించింది. దీంతో ఏపీలో తొలి జీబీఎస్ మరణం నమోదైంది.. గులియన్ బారే సిండ్రోమ్‌తో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన మహిళ గత కొన్ని రోజుల నుంచి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
కాగా.. గుంటూరు ఆసుపత్రిలో గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో నలుగురు బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వారిలో ఇద్దరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో నాలుగు రోజుల్లోనే ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. చేతులు స్పర్శ కోల్పోయినట్టు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచిస్తున్నారు.
కాగా.. జీబీఎస్ కేసులు వరుసగా నమోదవడంతో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అయితే దీనిపై ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని.. పేర్కొంది.. చికిత్సకు అవసరమైన ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది..
లక్షణాలు ఇవే..
ఈ వైరస్ పేరు గులియన్ బారే సిండ్రోమ్. దీని బారినపడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థను ఈ వైరస్ దెబ్బతీస్తుంది. దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు. అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు.
తొలి దశలో చికిత్స అందితే 4 వారాల్లో కోలుకునే అవకాశం
వ్యాధి సోకిన తొలి దశలోనే ఆస్పత్రిలో చేరితే.. 4 వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి ముదిరితే..కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టొచ్చు. అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన ఒకట్రెండు వారాల తర్వాతే ఇది బయటపడుతుంది. అరుదుగా వాడే ఇన్‌ఫ్లూయెంజా, టెటనస్ టీకాల వంటివి కూడా గులియన్ బారే సిండ్రోమ్‌కు కారణం కావొచ్చు. అయితే, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని..కరోనాలా ఇది అంటువ్యాధి కాదని చెబుతున్నారు..వైద్యులు. చికిత్సతో నయం చేయవచ్చని భరోసా ఇస్తున్నారు.
































