గొడ్రాలు అనే మాట పడలేకే ఈ నాటకం

9 నెలలు గుడ్డలు పెట్టుకుని గర్భం దాల్చినట్లు నటన


కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో కలకలం సృష్టించిన గర్భిణి కొప్పిశెట్టి సంధ్యారాణి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది.

దీనికి సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. దేవీపట్నం మండలం ఇందుకూరిపేటకు చెందిన కొప్పిశెట్టి సంధ్యారాణి 9 నెలల గర్భిణి కావడంతో ఆమె భర్త రాజమహేంద్రవరంలోని జయ కిడ్నీకేర్‌ ఆసుపత్రికి గురువారం పురిటికి తీసుకువచ్చాడు. ఆసుపత్రిలో ఆమెకు ఓపీ చీటీ రాశారు. డాక్టర్‌ చూసేలోగా ఆమె రెండుసార్లు బయటకు వచ్చింది. అలా మూడోసారి బయటకు వచ్చి కనిపించకుండా పోయింది.

దీంతో కంగారుపడిన సంధ్యారాణి భర్త విషయాన్ని త్రీటౌన్‌ పోలీసులకు తెలిపాడు. త్రీటౌన్‌ సీఐ వి.అప్పారావు పర్యవేక్షణలో ఎస్సై షేక్‌సుభాణీ, మరికొంత మంది పోలీసులు రెండు టీములుగా విడిపోయి ఆచూకీ కోసం గాలించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సంధ్యారాణి ఫోన్‌ ఆధారంగా కాకినాడలో ఆమె ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడ బస్టాండ్‌లో ఆమెను పట్టుకున్నారు. పోలీసులు ఆమెను ప్రశ్నించగా…తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని, తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారని, ప్రసవం అయిన వెంటనే పిల్లను ఎవరో ఎత్తుకెళ్లిపోయారని, పలు రకాలుగా పోలీసులకు తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

9 నెలలు గుడ్డలు పెట్టుకుని గర్భిణిగా..
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో దుర్గను పరిశీలించిన వైద్యులు ఆమె గర్భిణి కాదని తేల్చి చెప్పారు. దీంతో హాతాశులయిన పోలీసులు తేరుకుని ఆమె ఈ నాటకం ఆడడానికి గల కారణాలను తెలుసుకున్నారు. దుర్గకు పెళ్లి అయి తొమ్మిది సంవత్సరా లు అయ్యింది. ఆమెకు పిల్లలు లేరు. దీంతో ఆమె బయటి వారు, ఇంటిలో కుటుంబ సభ్యులు ఆమెను గొడ్రాలుగా చూస్తున్నారు అనే భావనంతో తనకు కడుపు వచ్చినట్లు నాటకమాడింది. ఈ తొమ్మిది నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని, భార్యాభర్తలు చాలా దూరంగా ఉండాలని తెలిపింది.

సంధ్యారాణి డాక్టర్‌ దగ్గరకు వచ్చి లోపలికి వెళ్లినప్పుడు తనకు గర్భం ఎందుకు రావడంలేదని మాత్రమే అడిగి బయటకు వచ్చేసేది. బయట భర్తను కూర్చోపెట్టి ఆ సమయంలో ఆమె ఒక్కతే డాక్టర్‌ వద్దకు వెళ్లేది. డాక్టర్‌ అంతా బావుందని, పురుడు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారని తెలిపేది. దీంతో దుర్గ భర్త నిజమని నమ్మి ఆమెను కంటికి రెప్పలా చూసుకోసాగాడు. ఆమె కడుపు రోజురోజుకీ పెరుగుతున్నట్లు గుడ్డలు పెట్టుకుని కాలం వెళ్లదీసింది. చివరికి ఆ తంతు బయటపడడంతో ఆమె పరిస్ధితిపై జాలిపడడం పోలీసులవంతైంది. పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసును వేగంగా ఛేదించిన త్రీటౌన్‌ సీఐ వర్రే అప్పారావు, ఎస్సై షేక్‌సుభానీ, పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.నరసింహాకిశోర్‌ అభినందించారు.