ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


వివరాల్లోకి వెళ్తే..

2014 జూన్ 18న కర్ణాటకలోని మల్లసంద్ర గ్రామానికి చెందిన ఎన్ఎస్ రవీష్ తన కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో మలనహళ్లి సమీపంలో అతివేగం కారణంగా వాహనం అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రవీష్ అక్కడికక్కడే మరణించాడు.

రవీష్ భార్య, కొడుకు, తల్లిదండ్రులు కలిసి రూ. 80 లక్షల బీమా పరిహారం కోరారు. అయితే, పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీటులో అతను నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ కూడా కుటుంబానికి పరిహారం ఇవ్వడానికి నిరాకరించింది. తర్వాత, వారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి టైరు పేలినందువల్ల ప్రమాదం జరిగిందని వాదించారు. కానీ కోర్టు, నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్టు ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఆ వాదనను తిరస్కరించింది.

ఈ కేసు చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహాదేవన్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి.. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు బీమా డబ్బులు రావని పేర్కొంది. బీమా చేసినా కూడా జరిగిన ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం అయితే సదరు కంపెనీలు బీమా డబ్బులు చెల్లించనక్కర్లేదని కోర్టు స్పష్టం చేసింది. వాహన నడిపేటప్పుడు బాధ్యతతో వ్యవహరించకపోతే, ప్రమాదాలే కాకుండా బీమా ప్రయోజనాలూ కోల్పోవాల్సి వస్తుందని వివరించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.