దిగ్గజ నటుడు కోట శ్రీనివాస్ రావు మరణం నుంచి ఇంక కోలుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి బి. సరోజాదేవి (87) కనున్నమూశారు.
వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు (సోమవారం) ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బి. సరోజాదేవి 1942, జనవరి 7న కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులో జన్మించారు. ఈమె తండ్రి బైరప్ప పోలీసు ఉద్యోగి. అయినప్పటికీ నాటకాలంటే ఇష్టంతో.. నాటక సంస్థల్లో చేరి నటింటే వారు. అదే విధంగా అప్పుడప్పుడూ సరోజా దేవితో నటింపజేసి చూసుకుని మురిసిపోయేవారు. ఇదే ఇష్టం సరోజాదేవిలో కూడా కలిగింది. ఆమె నటక ప్రదర్శనలతోనే సినీ రంగ ప్రవేశానికి బీజం పడింది.
13 ఏళ్ల వయసులోనే:
1955లో ఓ నాటకంలో ఆమె ప్రదర్శనను చూసిన కన్నడ దర్శక నిర్మాత కన్నప్ప భాగవతార్ సరోజాదేవికి ‘మహావకి కాళిదాసు’ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఆమె వయసు 13 ఏళ్ళు. తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు రావడంతో.. తన మకాం మద్రాసుకు మార్చి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇక తెలుగులో ఆమెకు వచ్చిన మొదటి అవకాశం పెళ్ళి సందడి. కానీ ఎన్.టి. రామారావు ‘పాండురంగ మహాత్యం’ ముందుగా విడుదలైంది. సరోజా దేవి ఎక్కువగా సాంప్రదాయ పాత్రల్లో నటించారు, ఆమె నటన, అందం, నృత్య ప్రతిభతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
మద్రాస్ కా సుందర్:
తమిళంలో సరోజా దేవి నటించిన ‘ఇరంబుతిరై’ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో.. హిందీలో ‘పైగా’ అనే పేరుతో పునర్నిర్మించారు. అందులో ఆమె నటనకు ఫిదా అయినా బాలీవుడ్ ఇండస్ట్రీ వరుస అవకాశాలు ఇచ్చింది. అలాగే ఎల్. వి. ప్రసాద్ తీసిన ‘ససురాల్’ సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. దీంతో ఉత్తరాది పత్రికలు ఆమెను ‘మద్రాస్ కా సుందర్ తారా’ అని అభివర్ణించాయి.
గుర్తింపు తెచ్చిన సినిమాలు:
తన జీవితాన్ని సినీ ఇండస్ట్రీకే అంకితం చేసిన సరోజాదేవి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర హీరోల సరసన నటించి 1960 నుంచి చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీమణులలో ఒకరుగా చక్రం తిప్పారు. ‘పాండురంగ మహత్యం’, ‘పెళ్లి కానుక’, ‘మంచి చెడు’, ‘దాగుడు మూతలు’, ‘పండంటి కాపురం’, ‘దాన వీర శూర కర్ణ’ వంటి తెలుగు చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
వరించిన అవార్డులు:
కళామ్మతల్లికి సరోజాదేవి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం, 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డును ఇచ్చింది. 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నాట్య కళాధర అవార్డులు అందుకుంది. 2007లో రోటరీ శివాజీ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు – సౌత్ అవార్డును సైతం సరోజాదేవి అందుకున్నారు. ఆమె 1998, 2005లో 45వ, 53వ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2010లో, భారతీయ విద్యా భవన్ ‘పద్మభూషణ్ బి. సరోజాదేవి నేషనల్ అవార్డు’ ప్రవేశపెట్టింది. ఇది ప్రదర్శన కళలలో కళాకారులను గౌరవించే జీవన సాఫల్య అవార్డుగా నిలిచింది.
































