ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ఉదయాన్ని ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.

ఢిల్లీలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో నగరమంతా చీకటి అలుముకుంది. ఇక నిరంతరంగా వర్షం పడడంతో వేడి, అధిక కాలుష్య స్థాయిల నుంచి ఉపశమనం లభించింది. ఇండియా గేట్, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మండి హౌస్, తుగ్లక్ రోడ్, నగరంలోని అనేక ఇతర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. పొరుగున ఉన్న నోయిడా, ఘజియాబాద్‌లలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇక భారీ వర్షాలతో ఢిల్లీ విమానాశ్రయం అప్రమత్తం అయింది. ప్రయాణీకులకు హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రస్తుతం సాధారణంగా ఉన్నాయని తెలిపింది. ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా పనిచేస్తున్నట్లు తెలిపింది. తాజా సమాచారం కోసం ప్రయాణీకులు తమ సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది.

ఇదిలా ఉంటే ఢిల్లీకి కేంద్ర వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. గంటకు 5-15 మి.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. నగర ప్రజలు ఉల్లాసంగా గడుపుతున్నారు. చల్లని గాలులతో ఉపశమనం పొందుతున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.