వర్షాకాలం రాగానే ప్రకృతి మరింత అందంగా మారుతుంది. వర్షపు చినుకులు పడినప్పుడు, పరిసరాలన్నీ పచ్చదనంతో నిండిపోయి, వాతావరణం చల్లబడి, ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఈ సమయంలో ప్రకృతిలో కలిగే మార్పులు, జలపాతాలు, చెరువులు, నదులలో నీరు పెరగడం, ఇలా అన్నీ కలిసి ప్రకృతిని మరింత అందంగా మారుస్తాయి. హైదరాబాద్ చుట్టూ అటువంటి ప్రకృతి సౌందర్యం గల, హైకింగ్‌కు అనువైన చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఆ ప్లేసులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
అనంతగిరి హిల్స్
హైదరాబాద్ నుంచి సుమారు 80-90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్(Ananthagiri Hills)కి దాదాపు రెండున్నర గంటల్లో చేరవచ్చు. ఇక్కడి కొండల మధ్య విస్తరించిన కాఫీ తోటలు, గ్రీన్ వ్యాలీలు హైకింగ్‌కి వెళ్లే వారిని కట్టిపడేస్తాయి. వర్షాకాలంలో ఇక్కడి పచ్చదనం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదయం వేళ హైక్ చేయడం ఉత్తమం.
కోయిల్ సాగర్
మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని కోయిల్ సాగర్ (Koil Sagar) డ్యామ్ హైదరాబాద్ నుంచి మూడు గంటల లోపే చేరుకునే దూరంలో ఉంటుంది. ఇక్కడ రోలింగ్ హిల్స్, నీటి పరవళ్లు, పచ్చని పొలాలు కనిపిస్తాయి. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ట్రెక్కింగ్ చేయకపోవడం మంచిది, ఎందుకంటే వర్షకాలంలో రాళ్లు జారిపోవడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
కొండపోచమ్మ రిజర్వాయర్
హైదరాబాద్‌కి సుమారు 2 గంటల దూరంలో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్ (Kondapochamma Reservoir) వర్షాకాలంలో అద్భుత దృశ్యాలను అందిస్తుంది. జలాశయంలో మేఘాల ప్రతిబింబం పడుతూ ఉన్న సమయంలో ఫోటోలు దిగడానికి ఇది బెస్ట్ స్పాట్. చిన్న హైకింగ్‌తో సహా ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.
కుంతాల జలపాతం
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కుంతాల జలపాతం (Kuntala Waterfalls)రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతంగా పేరుగాంచింది. 150 అడుగుల నుంచి నీటి ప్రవాహం ఆకట్టుకుంటుంది. ఫారెస్ట్ మార్గం కూడా విహారయాత్రగా అనిపిస్తుంది. వర్షాకాలంలో తప్పకుండా వాటర్‌ప్రూఫ్ షూలు, గ్లవ్స్ వంటివి ధరించడం అవసరం. వీకెండ్‌ల్లో జనసంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం వల్ల వీక్‌డేస్‌కి ప్రాధాన్యం ఇవ్వండి.
భువనగిరి కోట
హైదరాబాద్‌కి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి కోట (Bhongir Fort) పెద్దదైన గ్రానైట్ రాక్ మీద నిర్మించబడి ఉంది. ఇక్కడ ట్రెక్ చేయడం ఆసక్తికరంగా ఉంటుంది, అయితే ఎలాంటి షెల్టర్ ఉండదు కాబట్టి వాన లేక ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో వెళ్లకూడదు. ఉదయం లేదా సాయంత్రం వేళ హైక్ చేయడం ఉత్తమం.
హైకింగ్‌కి వెళ్లే వారికి కొన్ని సూచనలు:
- గ్రిప్ ఉన్న షూలు తప్పనిసరిగా వేసుకోండి.
- నీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్, రిపెల్లెంట్స్ తీసుకెళ్లండి.
- వర్షాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో జారి పడే ప్రమాదం ఉన్న ప్రదేశాలకి జాగ్రత్తగా వెళ్లండి.
- ప్లాస్టిక్ ఉపయోగించకుండా, ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేయండి.
































