చనిపోయిన ఓ మహిళ అకౌంట్లోకి ఏకంగా లక్ష కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..నోయిడా, దన్‌కౌర్ ప్రాంతానికి చెందిన గాయత్రి దీవీ రెండు నెలల క్రితం చనిపోయింది.
ప్రస్తుతం ఆమె ఫోన్‌ను కొడుకు దీపక్ వాడుతున్నాడు. ఆదివారం రాత్రి అతడికి ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి అతడు షాక్ అయ్యాడు. తల్లి అకౌంట్లోకి 1001356000000000000100235600000000299 డబ్బు డిపాజిట్ అయిందని ఆ మెసేజ్‌లో ఉంది.
అతడికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే యూపీఐ యాప్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. అందులో నిజంగానే అంత డబ్బు పడిందని ఉంది. ఆ నెంబర్లను లెక్కబెట్టి.. అది ఎంతో తెలుసుకోవడానికి అతడికి కష్టంగా మారింది. వెంటనే ఫ్రెండ్స్‌కు మెసేజ్ పంపి ఆ మొత్తం ఎంతో అడిగాడు. అది 1.13 లక్షల కోట్లను తెలిసి అందరూ అవాక్ అయ్యారు. తల్లి ఖాతాలో అంత డబ్బుపడ్డం నిజమా కాదా అని తెలుసుకోవడానికి మరుసటి రోజు దీపక్ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు సిబ్బంది అకౌంట్ చెక్ చేశారు.
బ్యాంకు ఖాతాలో అంత డబ్బు పడ్డం నిజమేనని, పెద్ద మొత్తం డబ్బులు ఖాతాలో పడ్డం కారణంగా అకౌంట్ ఫ్రీజ్ చేశామని వారు చెప్పారు. అంతేకాదు.. బ్యాంకు అధికారులు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ను కూడా అలర్ట్ చేశారు. ఇన్‌కమ్ టాక్స్ అధికారులు ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయన్నదానిపై ఎంక్వైరీ మొదలెట్టారు. బ్యాంకు వైపు నుంచి టెక్నికల్ సమస్య లేదా మనీ ల్యాండరింగ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక, దీపక్ తల్లి ఖాతాలోకి లక్ష కోట్లు పడ్డ విషయం బంధువులు, ఊర్లో వాళ్లకు తెలిసింది. దీపక్‌కు ఫోన్ చేసి ఆరా తీయటం మొదలెట్టారు. పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తుండటంతో అతడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.
































