నేతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం వచ్చాక చేనేత కార్మికులకు అండగా ఉంటామని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ మరో సంచలమైన ప్రకటన చేశారు. చేనేత కార్మికులకు 50 ఏళ్ళ వయసు నుంచే ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనుందని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.
అతి చిన్న వయసులోనే నేతన్నలు అనారోగ్యాల బారిన పడటమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని ఆయన చెప్పారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చేనేతలే ప్రత్యేకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. అలాంటి చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఈ పెన్షన్ సౌలభ్యం కల్పించామని ఆయన అన్నారు.
11వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జరిగిన ఈ సభలో చేనేత కార్మికులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. రాజధాని అమరావతిలో చేనేతల వైభవాన్ని చాటి చెప్పేందుకు ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువమంది ఈ చేనేత రంగంపై ఆధారపడి పని చేస్తున్నారు. ఇలాంటి కార్మికులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో చేనేత కార్మికులకు 27 కోట్ల రూపాయల రుణాలను 55,500 మందికి అందించామని.. అదేవిధంగా 90,765 కుటుంబాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించామని ఆయన గుర్తు చేశారు.
అంతేకాకుండా మరమద్దాల కార్మికులకు కూడా తమ మద్దతు విస్తరిస్తామని కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 50% సబ్సిడీతో మరమద్గాలకు 80 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని.. ఈనెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును వారికి అందిస్తామని అన్నారు. భవిష్యత్తులో మరమగ్గాలను 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 93 వేల చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఈ లబ్ది చేకూరుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్ సవిత తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు, చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.































