అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్ నిర్ణయం భారత టెక్స్టైల్, అప్పారెల్ రంగంపై భారీ ప్రభావం చూపుతోంది. 50 శాతం పెరిగిన పన్ను కారణంగా, అమెజాన్, వాల్‌మార్ట్, టార్గెట్ వంటి ప్రముఖ అమెరికన్ రిటైలర్లు భారతదేశం నుంచి వస్తువుల కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి ఇప్పుడు పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది.
ఎగుమతిదారుల ప్రకారం, అమెరికా కొనుగోలుదారులు లేఖలు, ఈమెయిళ్ల ద్వారా “మరుసటి ఆదేశాలు వచ్చే వరకు సరుకు రవాణా ఆపేయండి” అని స్పష్టంగా సూచించారు.
అమెరికా దిగుమతి దారులు, టారిఫ్ వల్ల పెరిగిన ఖర్చును మీరే భరించమని భారత ఎగుమతిదారులపై ఒత్తిడి పెడుతున్నారు. ఈ అదనపు సుంకం వల్ల సరుకు ధరలు 30-35% వరకు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అమెరికాకు వెళ్ళే ఆర్డర్లు 40-50% వరకు పడిపోవచ్చని అంచనా. పరిశ్రమ అంచనాల ప్రకారం, దీని వల్ల 4-5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
అమెరికా మార్కెట్‌లో ఆధారపడిన పెద్ద కంపెనీలు
వెల్‌స్పన్ లివింగ్, గోకల్దాస్ ఎగుమతులు, ఇండో కౌంట్, ట్రైడెంట్ వంటి ప్రముఖ ఎగుమతిదారులు తమ అమ్మకాలలో 40% నుంచి 70% వరకు అమెరికా మార్కెట్ నుంచే సాధిస్తున్నారు. అమెరికా, భారత టెక్స్టైల్ మరియు అప్పారెల్ పరిశ్రమకు అతిపెద్ద ఎగుమతి గమ్యం. గత ఆర్థిక సంవత్సరంలో $36.61 బిలియన్ విలువైన మొత్తం ఎగుమతులలో 28% వాటా అమెరికాదే.
ట్రంప్ ప్రభుత్వం 25% టారిఫ్‌ను వెంటనే అమలు చేసి, ఆగస్టు 28 నుంచి మరో 25% అదనంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. కారణం భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించడమే. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో “భారతదేశం నేరుగా లేదా పరోక్షంగా రష్యా చమురు దిగుమతి చేస్తోంది” అని పేర్కొంది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని “అన్యాయం, అనవసరం, అనుచితం” అని ఖండించింది. 1.4 బిలియన్ జనాభాకు ఇంధన భద్రతను కాపాడేందుకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని, ఇది పూర్తిగా మార్కెట్ పరిస్థితుల ప్రకారమేనని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత యూరప్‌కు వెళ్లిపోయిన సాంప్రదాయ సరఫరా మార్గాలను భర్తీ చేయడమే రష్యా చమురును దిగుమతి చేసుకోవడానికి కారణమని తెలిపింది.
భారత ప్రభుత్వం ఇలా చెప్తుంది అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా రష్యాతో పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నారు. అమెరికా రష్యా నుంచి అణు విద్యుత్ పరిశ్రమ కోసం యురేనియం, ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ కోసం పల్లాడియం, అలాగే ఎరువులు, రసాయనాలు కొనుగోలు చేస్తోంది. యూరోపియన్ యూనియన్ కూడా 2024లో రష్యా నుంచి రికార్డు స్థాయిలో గ్యాస్ (LNG) దిగుమతి చేసుకుంది. దీనికీ ఇప్పుడూ భారత్‌పై వేసిన నిబంధనలు అన్యాయమని భారత ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పరిణామాలతో భారత ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలు అమెరికా మార్కెట్లో కేవలం 20% టారిఫ్ మాత్రమే చెల్లించాల్సి రావడంతో, ఆర్డర్లు వాటి వైపు మళ్లే ప్రమాదం ఉంది. “ఇది కొనసాగితే, ఉద్యోగాలు, ఫ్యాక్టరీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది” అని ఒక టెక్స్టైల్ యజమాని NDTVకు తెలిపారు.
ప్రభుత్వం త్వరగా అమెరికాతో చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే, భారత టెక్స్టైల్ రంగం ఎగుమతి వృద్ధి గత దశాబ్దంలో ఎన్నడూ ఎదురుకాని సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.































