ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కలిగి ఉన్నంత మాత్రన భారత పౌరుడు కాలేడు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

భారత పౌరసత్వాన్ని నిర్ధారించడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డ్ లేదా ఓటరు ఐడీ వంటి పత్రాలు ఉంటే సరిపోదని బాంబే హైకోర్టు పేర్కొంది. ఒక వ్యక్తికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి పత్రాలు ఉంటే అతను భారత పౌరుడు అవుతాడని అర్థం కాదని చెప్పింది.


బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లకు పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన బాంబే హైకోర్టు.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఏడాది పాటు భారత్‌లోనే ఉంటున్నాడని తెలిపింది.

పౌరసత్వం అనేది 1955 పౌరసత్వ చట్టంలోని నిబంధనల ప్రకారం ఖచ్చితంగా నిర్ణయించబడుతుందని హైకోర్టు పేర్కొంది. పౌరసత్వ చట్టం ప్రకారం ఎవరు భారత పౌరులు కావచ్చు? ఎవరు భారత పౌరుడు కాకూడదు? స్పష్టం చేస్తోందని జస్టిస్ అమిత్ బోర్కర్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. పౌరసత్వం ఎలా పొందవచ్చో ఈ చట్టం వివరిస్తుందని తెలిపింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కేవలం పౌరులను గుర్తించడానికి లేదా వారికి సేవలు అందించడానికి మాత్రమేనని ధర్మాసనం తెలిపింది.

బాబు అబ్దుల్ రవూఫ్ సర్దార్ అనే వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సరైన పాస్ పోర్టు, వీసా లేకుండా బాబు అబ్దుల్ భారత్ లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఇండియన్ పాస్ పోర్టు సహా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నాడు. ఈ కేసు విచారించిన ధర్మాసనం బెయిల్ నిరాకరించింది.

1955లో పౌరసత్వ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని, ఇది ఎవరిని పౌరుడు అని పిలుస్తారో, లేకపోతే ఎవరు పౌరులుగా మారవచ్చో స్పష్టంగా నిర్వచించిందని జస్టిస్ బోర్కర్ అన్నారు. ‘నా అభిప్రాయం ప్రకారం, పౌరసత్వ చట్టం, 1955 భారతదేశంలో పౌరసత్వం, జాతీయతను నిర్వచించే చట్టం. ఎవరు పౌరుడు, పౌరుడు ఎలా, పౌరసత్వం కాకపోతే దాన్ని ఎలా పొందవచ్చో స్పష్టం చేసింది. కేవలం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ ఉన్నంత మాత్రాన భారత పౌరుడు కాలేడు.’ అని జస్టిస్ బోర్కర్ అన్నారు.

1955 నాటి చట్టం భారత పౌరులకు, చొరబాటుదారులకు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చెబుతోందని ధర్మాసనం పేర్కొంది. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించే వారికి భారత పౌరసత్వం పొందే హక్కు ఏ విధంగానూ లేదని తెలిపింది. పౌరుడికి, చొరబాటుదారుడికి మధ్య వ్యత్యాసం ముఖ్యమని, అప్పుడే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడగలమని జస్టిస్ బోర్కర్ అన్నారు. దీనివల్ల పౌరులకు తమ హక్కులు లభిస్తాయని, అక్రమ వ్యక్తులెవరూ వాటిని పొందరని స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.