తమిళ సూపర్‌స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక అతిపెద్ద మీటింగ్ నిర్వహించారు. మధురై మానాడు పేరుతో నిర్వహించిన ఈ సభకు 4 లక్షల మంది వచ్చారు.
వైఎస్ జగన్ సిద్ధం సభల మాదిరిగా.. ఇక్కడ కూడా విజయ్ ప్రజల్లోకి ఓ ర్యాంప్‌ను వేసి.. అందరికీ అభివాదం చేశారు. కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఆయనమీదకు రావడం కూడా కనిపించింది.
ఆ తర్వాత ప్రసంగాన్ని ప్రారంభించిన విజయ్ తాను సింహంలా సింగిల్‌గా వస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఒక్కసారి సింహం గర్జిస్తే 8 కిలోమీటర్లమేర భూమి వణికిపోతుందన్నారు. అడవుల్లో ఎన్నో తోడేళ్లుంటాయి కాని.. ఒకటే సింహం ఉంటుందంటూ.. ఫ్యాన్స్‌ను టిక్ డైలాగ్స్‌తో ఉర్రూతలూగించారు. సభ ముందు వరకు బీజేపీతో పొత్తు అనౌన్స్ చేస్తారన్న ఊహాగానాలున్నాయి కాని.. ఆయన వేదికపైకి వచ్చాక తన భావజాలం బీజేపీకి వ్యతిరేకం అంటూ ప్రకటించారు. బీజేపీతో పొత్తు ఉండదు ఉండబోదన్నారు విజయ్. అంతేకాదు డీఎంకే ప్రధాన రాజకీయ శత్రువుగా చెబుతూ.. అంకుల్ స్టాలిన్ అంటూ పంచ్‌లు విసిరారు.
అలంగానల్లూరు జల్లికట్టు సాక్షిగా.. మధుర మీనాక్షి సాక్షిగా.. దివంగత ఎంజీఆర్ రాజకీయ స్ఫూర్తితో.. మరో ఎంజీఆర్‌గా పేరుపొందిన విజయ్‌కాంత్ గడ్డపై నుంచి తన రాజకీయ గర్జన చేస్తున్నానంటూ అక్కడి కల్చర్‌ని ఎత్తిచూపుతూ ప్రసంగాన్ని చేశారు. 1967, 1977లో ఎలా అయితే రాజకీయ మార్పులు జరిగాయో.. 2026లోనూ అదే రిపీట్ అవుతుందన్నారు విజయ్. ఇక బీజేపీ తమిళనాడు ముస్లింలను టార్గెట్ చేయడం, తమిళ జాలర్లను నిర్లక్ష్యం చేయడం, అసలు తమిళ కల్చర్‌నే అణచివేయాలని చూస్తోందంటూ విమర్శల దాడి చేశారు. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వం ప్రజలను పాలించడానికి వచ్చిందా? మైనార్టీలను అణచివేయడానికి అధికారం చేపట్టిందా అంటూ ఘాటు విమర్శలు చేశారు. నీట్ రద్దునూ సమర్ధించారు విజయ్. ఇక డీఎంకే అధినేత సీఎం స్టాలిన్‌పైనా పంచ్‌ల వర్షం కురిపించారు. అంకుల్ అంటూ వ్యంగ్యంగా సంభోదించారు. ప్రస్తుత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. మహిళలపై అఘాయిత్యాలు, నిరుద్యోగ సమస్య, లిక్కర్ స్కాం వంటి ఆరోపణలు ఉన్న డీఎంకే నేతలు మిస్టర్ క్లీన్ ఎలా అవుతారంటూ విమర్శించారు.
ప్రజా సేవకోసం వస్తున్నానన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నా మార్క్ క్లీన్ గవర్నెన్స్ ఏంటో చూపిస్తాననన్నారు విజయ్. వచ్చే ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో నిలబడేది తానే అని.. ఓటు వేసేటపుడు తన ఫేస్ మాత్రమే గుర్తుండాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ప్రజలు ధైర్యంతో ఓటేయాలని.. అప్పుడే మనం విజయం సాధిస్తాం అంటూ చెప్పారు. ఇక మధురై తూర్పు నియోజవర్గం నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటన చేశారు విజయ్.
మొత్తం నాలుగు లక్షల మంది అభిమానులు, సపోర్టర్ల మధ్య జరిగిన తమిళ వెట్రి కళగం మధురై మానాడు సభ హిట్ అనే చెప్పాలి. అయితే ఈ సపోర్ట్ ఎంతవరకు ఓట్లుగా మారతాయన్నది ఆసక్తికరం.




































