ప్రస్తుతం చాలా మంది ఊబకాయం, మధుమేహం, పీసీఓఎస్ వంటి పలు రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ తగ్గడం వల్లే ఇలాంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందుకే వీటికి దూరంగా ఉండడానికి ఏరోబిక్ వ్యాయామం, యోగా లాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాటిలో నడక అత్యంత ప్రభావవంతమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు. అయితే, కేవలం రోజుకు కొన్ని అడుగులు నడిచి లక్ష్యాన్ని పూర్తి చేయడమే కాకుండా, వ్యాయామాలను మెరుగుపరుచుకోవడానికి మరింత ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నయా ట్రెండ్ 6-6-6 నడక పద్ధతి వైరల్ అవుతోంది. మరి, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
6-6-6 నడక వ్యాయామం అనేది ఒక సులభమైన, సమర్థవంతమైన ఫిట్‌నెస్ పద్ధతి. ఇది బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మానసిక స్థితిని ఉత్తేజపరచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
6-6-6 నడక పద్ధతి అంటే :
60 నిమిషాల నడక : రోజులో ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 6 గంటలకు 60 నిమిషాలు చురుకుగా నడవడం.
6 నిమిషాల వార్మ్-అప్ : నడక ప్రారంభించే ముందు 6 నిమిషాల పాటు నెమ్మదిగా వార్మ్-అప్ చేయాలి. ఇది శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేస్తుంది.
6 నిమిషాల కూల్-డౌన్ : నడక ముగిసిన తర్వాత 6 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. ఇది గుండె వేగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది.
6-6-6 నడక పద్ధతిలో ఎక్కువ భాగం వేగంగా, చురుకైన నడక ఉంటుంది. అంతేకాకుండా ఇది తక్కువ వ్యవధిలో, సులభంగా ఉండేలా రూపొందించబడింది కాబట్టి, బిజీగా ఉండే రోజులో వ్యాయామం చేయాలనుకునే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ 6-6-6 పద్ధతి వారానికి 150 నిమిషాల వ్యాయామాన్ని పూర్తి చేయడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పెద్దలు వారానికి కనీసం 150–300 నిమిషాల మితమైన-తీవ్రత శారీరక శ్రమ లేదా 75–150 నిమిషాల శక్తివంతమైన-తీవ్రత శారీరక శ్రమలో పాల్గొనాలని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.
ఈ పద్ధతి ఎందుకంటే :
సమయం : ఉదయం 6 లేదా సాయంత్రం 6 గంటలకు నడవడం, దినచర్యను స్థిరంగా కొనసాగించడానికి ముఖ్యమైనది. ఇది రోజువారీ షెడ్యూల్‌లో నడకను అలవాటుగా మార్చడానికి సులభతరం చేస్తుంది.
ఉదయం పూట : ఖాళీ కడుపుతో నడవడం వల్ల కొవ్వు ఎక్కువగా కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
సాయంత్రం : భోజనం తర్వాత నడవడం బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
వ్యవధి: ప్రతిరోజూ ఒక గంట నడవడం ఆరోగ్యానికి మంచిది. ఇది వారానికి 150 నిమిషాల తీవ్రమైన వ్యాయామంతో సమానమని నిపుణులు చెబుతున్నారు. చురుకైన నడక వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఎముకలను బలపరచడంతో పాటు కండరాల శక్తిని పెంచుతుందని వివరించారు. అంతేకాకుండా ఈ నడక విధానం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
వార్మ్-అప్, కూల్-డౌన్ : ఈ రెండూ గుండె వేగాన్ని, కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇది నడుస్తున్నప్పుడు కండరాల నొప్పులు లేదా బెణుకులు రాకుండా నివారించడంతో పాటు కండరాల నొప్పిని తగ్గించి, గుండె వేగాన్ని క్రమంగా సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుందని తెలిపారు.
betterhealth ప్రకారం, ప్రయోజనాలు :
- గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడం
- అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కీళ్ల, కండరాల నొప్పి లేదా దృఢత్వం, మధుమేహం వంటి పరిస్థితుల మెరుగైన నిర్వహణ.
- ఎముకలు దృఢంగా మారతాయి
- కండరాల బలం పెరుగుతుంది
- శరీర కొవ్వు తగ్గుతుంది
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

































