నిమిషంలోనే కోరికలు తీర్చే నిమిషాంబ దేవి ఆలయం.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి..?

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. దక్షిణ భారత దేశంలో అనేక సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో అతి పురాతనమైన ఆలయాలు మనకు కనిపిస్తుంటాయి.


అలాగే కర్ణాటక, తమిళనాడులో ప్రవహించే కావేరి నది ఒడ్డున ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో ఒకటే నిమిషాంబ దేవి ఆలయం. ఈ నిమిషాంబ దేవి ఆలయం ఎక్కడుంది..? అనే విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఈ ఆలయంలో నిముషంలోగా కోరిక కోరుకోవాలి. 21 సెకన్లు.. 21 నిమిషాల 21 రోజుల్లోనే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ నిమిషాంబ దేవి ఆలయం కర్ణాటకలోని శ్రీ రంగపట్నానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజాం అనే చిన్న పల్లెటూరులో ఉంది. పార్వతీదేవి అవతారమైన నిమిషాంబ దేవి ఆలయం ఇక్కడ వెలసి ఉంది. నిమిషాంబ దేవిని శివుని భార్య పార్వతి దేవి పునర్జన్మగా భావిస్తారు. ఇక్కడ భక్తుల కోరికలు ఒక్క నిమిషంలోనే నెరవేరతాయని ప్రసిద్ధ నమ్మకం. నవరాత్రులు, శివరాత్రి, ఉగాది, దీపావళి వంటి ప్రధాన పండుగ రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

నిమిషాంబ దేవి దర్శనానికి వెళ్లే భక్తులు అమ్మవారికి నూతన వస్త్రాలతోపాటు పసుపు, కుంకుమ, గాజులు సమర్పిస్తారు. అంతేకాక నిమిషాంబ దేవికి ఇష్టమైన నిమ్మకాయ దండను కూడా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయను తీసుకువెళ్లి పూజాగదిలో ఉంచుకుంటే సకల శుభాలూ జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక నిమిషాంబ అమ్మవారి ఆలయంలో మరో విశేషం ఏంటంటే.. బలి భోజనం. అమ్మవారి నివేదన తరువాత పూజారి బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి, ఆలయంలోని గంటను మోగించగానే కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్లిపోతాయి.

కర్ణాటకలోని శ్రీ రంగపట్నానికి చేరుకోడానికి తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి. మైసూర్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఈ ఆలయానికి బస్సులో చేరుకోవచ్చు. మొత్తం 135 కి.మీ. ఉంటుంది. లేదంటే శ్రీ రంగపట్నం నుండి ఆటోలో వెళ్లొచ్చు . అలాగే శ్రీ రంగపట్నం వరకు రైలులో వెళ్లి అక్కడి నుండి ఆటో లేదా టాక్సీలో వెళ్లవచ్చు. ఇక రోడ్డు మార్గంలో అయితే మైసూర్ నుండి ఆలయానికి నేరుగా బస్సులో వెళ్లవచ్చు. దాదాపు 136 కి. మీ. ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.