హైదరాబాద్ లో ఉంటున్నారా..? వీకెండ్ ట్రిప్ కోసం ఈ పార్కులు ట్రై చేయండి

హైదరాబాద్ మహానగరంలో ఉరుకులు పరుగుల జీవితం, కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు, వర్షం, వరద నీటి కష్టాలతో సతమతం అవుతున్న భాగ్యనగర వాసులకోసం ఇప్పుడు ఎక్కడ చూసినా అర్బన్ పార్కులు అభివృద్ధి చెందుతున్నాయి.


హైదరాబాద్ నగర శివారులో ఇప్పటికే 109 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ఈ పార్కులు వీకెండ్ లో నగర వాసులకు ఆక్సిజన్ బ్యాంకులుగా మారుతున్నాయి. నిత్యం కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నవారికి స్వచ్ఛమైన ప్రాణ వాయువును అందజేస్తున్నాయి.

కండ్లకోయ ఆక్సిజన్ పార్కు నగరవాసులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పార్కు హైదరాబాద్‌ కు సుమారు 30 కిమీల దూరంలో మేడ్చల్‌ కు వెళ్లే మార్గంలో ఔటర్ రింగ్ రోడ్‌ కు సమీపంలో ఉంది. ఇక్కడికి హైదరాబాద్ నుంచి ప్రతి 2 గంటలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. లేదా క్యాబ్ ద్వారానైనా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ పార్కు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే ప్రవేశ రుసుం పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.15 గా ఉంది.

ఇక మంత్లీ పాస్ రూ.100 గా ఉంది. ఇక్కడ గుబురైన చెట్ల మధ్యలో నడిచేందుకు వీలుగా ఏర్పాటుచేసిన కెనాఫీ వాక్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పార్కులో వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలు కనిపిస్తాయి. మొత్తం 2.5 కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్ ఉంటుంది. అలాగే వాకింగ్ బ్రిడ్జ్, ఓపెన్ క్లాస్‌ రూం, హెర్బల్ గార్డెన్, యోగా షెడ్, ట్రీ హౌజ్ కూడా ఉంటాయి. అయితే ఈ పార్కులో ఎలాంటి ఫుడ్ స్టాల్స్ కనిపించవు. మీ వెంట తప్పకుండా ఆహారం తీసుకెళ్లాలి.

అటవీ ప్రాంతంలో ఒక్క రాత్రి అయినా గడపాలని చాలా మందికి ఉంటుంది. వారి కోసమే మెదక్​ జిల్లా నర్సాపూర్​ అటవీ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇక్కడికి వెళ్తే అదో ప్రత్యేకమైన అనుభూతిగా ఉంటుంది. నర్సాపూర్​ అటవీ ప్రాంతంలో 38 కాటేజీలు ఉన్నాయి. పచ్చదనం, జీవ వైవిధ్యానికి ప్రత్యేకంగా ఇక్కడి వాతావరణం ఉంది. ఇక్కడి అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో ట్రెక్కింగ్ కూడా ఉంది. అలాగే సదస్సులు, సమావేశ మందిరాలు, కోతుల కోసం పండ్ల చెట్లతో పాటు మంకీ ఫుడ్‌కోర్టు కూడా ఇక్కడ చూడొచ్చు.

నగరవాసులకు చిట్టడవిలో తిరుగుతున్న అనుభూతిని కలిగించేలా పచ్చని చెట్లతోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఈ పాలపిట్ట పార్కును ఏర్పాటుచేసింది. ఇది భారత్ లోనే మొట్టమొదటి సైక్లింగ్ పార్కు కావడం విశేషం. గచ్చిబౌలి సమీపంలోని కొత్తగూడ రక్షిత అడవిలో ఈ పార్కును ఏర్పాటు చేశారు. 25 వేల పైచిలుకు చెట్లు ఉన్నాయి. పక్షుల అరుపుల మధ్య సైకిల్‌ పై అడవంతా తిరగొచ్చు. ఇక్కడ సైకిళ్లు అద్దెకు కూడా ఇస్తారు.

ఇక హైదరాబాద్ వాసుల కోసం తక్కువ విస్తీర్ణంలో, తక్కువ సమయంలోనే దట్టమైన అడవిని సృష్టించారు. మియావాకీ విధానంలో అడవిని సృష్టించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలోని తంగేడువనాన్ని కుడా ఇలాగే మియావాకీ పద్దతిలోనే అభివృద్ధిచేశారు. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ అడవి ఉంది. వాకింగ్‌ ట్రాక్, యోగా సెంటర్ తో పాటు పిల్లల ఆటస్థలం కూడా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.