విజయవాడ పోలీసులు తాజాగా ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు ఓ హెచ్చరిక చేసారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాల్ని దృష్టిలో ఉంచుకుని ఓ గూగుల్ యాప్ ను వాడొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ మేరకు ఓ పోస్టర్ ను సైతం విడుదల చేశారు. సదరు యాప్ ను కానీ, లింక్స్ ను కానీ ఉపయోగించి ఫొటోలు, వీడియోలు షేర్ చేసి చిక్కుల్లో పడొద్దంటూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
గూగుల్ జెమినీ తాజాగా తీసుకొచ్చిన ఏఐ టూల్ నానో బనానా. ఈ టూల్ ను ఉపయోగించి యూజర్లు తమ ఫొటోల్ని, లేదా వీడియోల్ని షేర్ చేసి వాటిని కావాల్సిన నమూనాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ టూల్ ద్వారా జనరేట్ చేసిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఒకరిని చూసి మరొకరు ఈ ఏఐ టూల్ వాడి తమ ఫొటోల్ని, వీడియోల్ని షేర్ చేసి కొత్తగా జనరేట్ చేసుకుంటున్నారు. అయితే ఇదే పేరుతో మోసాలు కూడా ఎక్కువయ్యాయి.
సైబర్ నేరగాళ్లు నానో బనానా ఏఐ టూల్ లేదా యాప్ పేరుతో లింక్స్ షేర్ చేసి వాటిలోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు షేర్ చేసే ఆప్షన్ ఇస్తున్నారు. అలా ఫొటోలు, వీడియోలు షేర్ చేయగానే వాటిని, ఇతర వివరాలను వాడి జనాల డబ్బుల్ని కొల్లగొట్టేస్తున్నారు. దీంతో విజయవాడ పోలీసులు తాజాగా నానో బనానా యాప్ వాడొద్దంటూ హెచ్చరికలు చేస్తున్నారు. నానో బనానా పేరుతో సోషల్ మీడియాలో మోసం జరుగుతోందని, అలాంటి లింక్స్, యాప్ లోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దని హెచ్చరికలు చేశారు.
అనుమానాస్పద లింక్స్, యాప్ లపై క్లిక్ చేయొద్దని, ఓటీపీ, పాస్ వర్డ్, ఇతర వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని, ఫోన్ కి వచ్చే అప్రత్యక్షమైన మెసేజ్ లను వెంటనే డిలీట్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. అలాగే ఇప్పటికే ఎవరికైనా తమ డేటా ఇచ్చేసి ఉంటే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.
































