తెల్ల వెంట్రుకలను పీకేస్తే మరిన్ని తెల్లవి మొలుస్తాయని చాలామంది నమ్ముతుంటారు. ఇది అపోహే. తెల్ల వెంట్రుకలేమీ పగబట్టవు. పీకేశారు కదాని మరిన్ని తెల్లవేమీ పుట్టుకురావు.
స్వతహాగా వెంట్రుకలో నల్ల రంగు కణాలేవీ ఉండవు. వీటి అడుగున, కుదుళ్ల చుట్టూరా ఉండే మెలనోసైట్లే రంగును తెచ్చిపెడతాయి. వీటి సంఖ్య తగ్గితే జుట్టు గోధుమ (బ్రౌన్) రంగులోకి మారుతుంది. పూర్తిగా తగ్గిపోతే తెల్లగా అవుతుంది. ఒక కుదురులో ఒక వెంట్రుకే ఉండదు. రెండు, మూడు వరకూ ఉండొచ్చు. అంటే ఒక తెల్ల వెంట్రుకను పీకేసినా దాని స్థానంలో రెండు, మూడు మొలిచే అవకాశం ఉంటుందన్నమాట. ఇవీ తెల్లగానే ఉంటాయి. అంతే తప్ప పీకేస్తే మరిన్ని తెల్ల వెంట్రుకలు మొలుస్తాయనటంలో నిజం లేదు. చిన్న వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా ఉన్నవి పలుచగా కనిపిస్తాయి. పీకేసిన తెల్ల వెంట్రుకలు చిన్నవైతే కొత్తగా వచ్చేవీ ఒత్తుగా కనిపిస్తాయి. దీంతో ఎక్కువ తెల్ల వెంట్రుకలు మొలిచినట్టు అనిపిస్తుంది (ఇల్యూషన్). ఏదేమైనా ఒక్కసారి వెంట్రుక తెల్లబడితే తిరిగి నల్లబడదు. దీన్ని వెనక్కి మళ్లించలేం గానీ మిగతావి త్వరగా తెల్లబడకుండా చూసుకోవచ్చు. నల్ల రంగుకు కారణమయ్యే మెలనోసైట్లు తగ్గటానికి విటమిన్ డి లోపం, మానసిక ఒత్తిడి, సిగరెట్లు తాగటం, ఇతరులు కాల్చిన సిగరెట్ల పొగ పీల్చటం, వాయు కాలుష్యం (కార్బన్ మోనాక్సైడ్), నిద్రలేమి, షిఫ్ట్ ఉద్యోగాలు, విశృంఖల కణాల వంటి రకరకాల అంశాలు కారణమవుతాయి. వీటి బారినపడకుండా చూసుకుంటే వెంట్రుకలు తెల్లబడే వేగాన్ని తగ్గించుకోవచ్చు. రాత్రిపూట కంటి నిండా నిద్రపోతే మెలటోనిన్ బాగా తయారవుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే విశృంఖల కణాల దుష్ప్రభావాలు తగ్గుతాయి. మరీ అవసరమైతే మెలటోనిన్, విటమిన్ డి, బీ కాంప్లెక్స్‌లో ఒకరకమైన క్యాల్షియం పాంటోథెనేటు మాత్రలు ఉపయోగపడతాయి.
































