నాడు చెత్త డంపింగ్ యార్డ్- నేడు రెండో ట్యాంక్ బండ్: హైదరాబాద్ కు మరో మణిహారం

హైదరాబాద్ లో మరో ట్యాంక్ బండ్ అందుబాటులోకి రానుంది. పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 26వ తేదీన ప్రారంభించనున్నారు.


దీన్ని తెలంగాణ ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. దీనికోసం బతుకమ్మ కుంట ముస్తాబైంది. అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు. బతుకమ్మలను ఇక్కడ నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చకచకా పూర్తి చేస్తోన్నారు.

గతంలో ఆక్రమణలకు గురైన చెరువు ఇది. దీన్ని హైడ్రా పునరుద్ధరించింది. ఆక్రమణల నుంచి విడిపించింది. అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఒకప్పుడు 14 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువు ఇది. ప్రస్తుతం 5.15 ఎకరాలకు పరిమితమైంది. బతుకమ్మ కుంట కనుమరుగు కావడానికి ప్రధాన కారణం ఈ ఆక్రమణలే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హైడ్రా చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతలో ఇది మళ్లీ జీవం పోసుకుంది. పునరుద్ధరణ పనులకు దారితీసింది.

చెత్త డంపింగ్ యార్డ్ గా గుర్తింపు పొందిన చెరువు ఇప్పుడు రెండో ట్యాంక్ బండ్ గా పేరు తెచ్చుకుంది. హైడ్రా, రెవెన్యూ, వాటర్ వర్క్స్, జీహెచ్‌ఎంసీ వంటి పలు విభాగాల సమన్వయంతో దీన్ని పునరుద్ధరించారు. ఈ పునరుద్ధరణ పనులతో చెరువు సుందరీకరణ మాత్రమే కాకుండా.. చుట్టుపక్కల నివాసాలు, కాలనీలకు వరద ప్రమాదాన్ని కూడా నివారించినట్టయింది. వరదనీటి ప్రవాహం మొత్తాన్నీ బతుకమ్మ కుంటలో చేరేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.

చెరువు ఈశాన్య దిశలో ప్రధాన ప్రవేశ ద్వారాన్ని నిర్మించారు. నీరు పొంగిపొర్లకుండా అడ్డుకోవడానికి అదనపు ఏర్పాట్లు చేశారు. ఇక్కడో అవుట్‌లెట్‌ను నిర్మించారు. సుందరీకరణలో భాగంగా హైడ్రా రెండు గెజిబోలు, పిల్లల ఆట వస్తువులు, ఓపెన్ ఎయిర్ జిమ్, అలాగే కట్ట చుట్టూ దీర్ఘచతురస్రాకార వాకింగ్ ట్రాక్‌ను నిర్మించింది. విశాలమైన ఘాట్ ను డెవలప్ చేశారిక్కడ. 26వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇది అందుబాటులోకి రాబోతోండటంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోన్నారు. ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.