వికీపీడియాకు ప్రత్యామ్నాయంగా గ్రోకీపీడియాను లాంచ్ చేస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. మరో రెండు వారాల్లో దీని ప్రయోగాత్మక వర్షన్‌ను అందుబాటులోకి తెస్తామని అన్నారు.
టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలన ప్రకటన చేశారు. వికీపీడియాకు పోటీగా త్వరలో గ్రోకీపీడియాను అందుబాటులోకి తెస్తానని అన్నారు. తన ఏఐ సంస్థ ఎక్స్‌ఏఐ ద్వారా దీన్ని లాంచ్ చేస్తానని తెలిపారు. గ్రోకీపీడియాకు సంబంధించి ప్రయోగాత్మక 0.1 ఎర్లీ బీటా వర్షన్ మరో రెండు వారాల్లో విడుదల చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. @amxfreeze యూజర్ చేసిన కామెంట్‌కు మస్క్ ఈ మేరకు స్పందించారు
గ్రోకీపీడియా ఎలా పనిచేస్తుందంటే..
@amxfreeze పోస్టు ప్రకారం, ఎక్స్‌ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ఆధారంగా గ్రోకీపీడియా పనిచేస్తుంది. ఇది వికీపీడియాలోని భారీ సమాచారాన్ని జల్లెడపడుతుంది. ఏది నిజం, ఏది పాక్షిక నిజం, ఏది అసత్యం, ఏ సమాచారం అసంపూర్ణంగా ఉందో గుర్తించి వికీపీడియాలోని సమాచారానికి ఈ మేరకు మార్పులు చేసి యూజర్లకు అందిస్తుంది. తద్వారా అసత్యాలు, పాక్షిక సమాచారం వంటి సమస్యలను తొలగిస్తుంది.
నెటిజన్లకు అసలైన సమాచార గనిగా గ్రోకీపీడియా మారుతుందని @amxfreeze కామెంట్ చేశారు. నిష్పాక్షికత, నిజాలు వెల్లడించడమే అజెండాగా గ్రోకీపీడియా ముందుకు సాగుతుందని అన్నారు. సంప్రదాయిక మీడియా, ప్రభుత్వ వ్యవస్థల ప్రభావం లేకుండా కచ్చితమైన పారదర్శక సమాచారం అందివ్వడమే గ్రోకీపీడియా లక్ష్యంగా ఉండాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
గ్రోకీపీడియా కూడా ఎక్స్‌లోని కమ్యూనిటీ నోట్స్ ఫీచర్ లాంటిదని కూడా సదరు నెటిజన్ కామెంట్ చేశాడు. కచ్చితమైన దిద్దుబాట్లు, నేపథ్య వివరాలను అందిస్తూ చెత్తను చీల్చుకుంటూ దూసుకెళ్లే బల్లెంలా గ్రోకీపీడియా పనిచేస్తుందని అన్నారు. గ్రోకీపీడియాపై ఎలాంటి పరిమితులు ఉండవని, ఇది మనుషులకు, ఏఐ వ్యవస్థలకూ ఒకే రీతిలో అందుబాటులో ఉంటుందని అన్నారు.
వికీపీడియా ప్రస్తుతం అమెరికాలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. సంప్రదాయవాదుల అభిప్రాయాలకు వికీపీడియాలో స్థానం లేకుండా పోయిందని కొందరు అంటున్నారు. వామపక్ష భావజాలం కలిగిన ఎడ్మినిస్ట్రేటర్ల గుప్పెట్లో ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ కూడా ఇటీవల వికీపీడియాపై ఫైర్ అయ్యారు.




































