ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వివో తన వీ60 సిరీస్‌లో వీ60ఈ (Vivo v60e) పేరిట మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మీడియాటెక్ డైమెన్‌సిటీ, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఏఐ ఇమేజింగ్ క్యాపబిలిటీస్, ఆరా లైట్ వంటి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సల్ కెమెరా ఇస్తుండడం విశేషం. వివో తీసుకొచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
వివో వీ60ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 15తో పనిచేస్తుంది. ఇందులో 6.77 అంగుళాల క్వాడ్‌కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేటు, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. డైమెండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ సదుపాయంతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్‌సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌ను అమర్చారు. వెనకవైపు 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 30ఎక్స్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, ఆరా లైట్ సదుపాయం ఉంది. ఆరా లైట్‌ను ఫ్లాష్‌లైట్‌గానూ వినియోగించుకోవచ్చు. ముందువైపు 50 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఏఐ ఫెస్టివల్ పోర్ట్రెయిట్, ఏఐ ఫోర్ సీజన్ పోర్ట్రెయిట్, ఇమేజ్ ఎక్స్‌పాండర్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి.
ఇందులో 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎన్‌ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, ఐపీ68, ఐపీ69 రేటింగ్ కలిగిన వాటర్ రెసిస్టెన్స్ సదుపాయం ఉంది. ఇక ధర విషయానికొస్తే.. ఇది మూడు వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.31,999, 12జీబీ+ 256జీబీ వేరియంట్ రూ.33,999గా కంపెనీ పేర్కొంది. ఎలైట్ పర్పుల్, నోబుల్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అధికారిక రిటైల్ స్టోర్‌లో లభ్యమవుతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఫోన్ లాంచ్ అవ్వడంతో టెక్ ప్రియులు దీని ధర, ఇతర వివరాల గురించి ఆరా తీస్తున్నారు. దీంతో గూగుల్ ట్రెండ్స్‌లోకి వచ్చింది.
































