ఏపీలో ( Andhra Pradesh)రైతులకు గుడ్ న్యూస్. రెండో విడత అన్నదాత సుఖీభవ పథకం పై కీలక అప్డేట్ వచ్చింది. రైతులకు ఒకసారి ఏపీ ప్రభుత్వం 5000 రూపాయల సాయం అందించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రెండో విడతగా మరో ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. కేంద్రంతో పాటు తమ వాటాగా సాయం అందించేందుకు నిర్ణయించింది. ఇందుకు దీపావళిని ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వస్తే కేంద్రం అందించే పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద 20వేల రూపాయల సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో కేంద్రంతో కలిపి 7000 రూపాయల మొత్తాన్ని విడుదల చేశారు. ఇప్పుడు దీపావళి కానుకగా మరో 7 వేల రూపాయలు అందించనున్నారు. చివరి విడతగా మరో 6000 రూపాయల మొత్తాన్ని అందిస్తారు. దీంతో 20 వేల రూపాయల మొత్తం ఇచ్చినట్టు అవుతోంది.
పీఎం కిసాన్ సాయం..
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్( pm Kisan) నిధులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. 21వ విడత నిధులను ఈనెల 18 లేదా 19వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం వరద ప్రభావిత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో రైతులకు ఆర్థిక సాయం ప్రకటించింది. మిగిలిన రాష్ట్రాల్లో దీపావళికి ముందే నిధుల విడుదలకు సూపర్ ప్రాయంగా నిర్ణయం తీసుకుంది.
రెండో విడత అన్నదాత సుఖీభవ..
ఈ ఏడాది ఆగస్టు రెండున అన్నదాత సుఖీభవ( annadatha Sukhi Bava) కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదువేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. కేంద్రం పీఎం కిసాన్ విడుదల చేయడంతో.. ఆ మొత్తం తోనే కలిపి అందించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనుంది దీపావళి కానుకగా. మొన్నటి మాదిరిగానే ఒకేసారి రైతుల ఖాతాల్లో 7వేల రూపాయల చొప్పున జమ కానుంది అన్నమాట. దీనిపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పీఎం కిసాన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలని సూచిస్తుంది. మొన్న ఈ కేవైసీ చేయకపోవడంతో చాలామందికి పీఎం కిసాన్ మొత్తం దక్కలేదు. మరోసారి అటువంటి తప్పిదం జరగకుండా ప్రతి రైతు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తుంది కేంద్ర ప్రభుత్వం. గ్రామ సచివాలయాల్లో ఈ కేవైసీ ప్రక్రియ చేపడుతున్నారు. పీఎం కిసాన్ అధికారిక ప్రకటన వచ్చిన తరువాత దీనిపై మరింత సమాచారం రానుంది. మొత్తానికి అయితే దీపావళి కానుకగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేయడానికి ముందుకు రావడం శుభపరిణామం.
































