పేద, మధ్యతరగతి వారికి పోస్ట్ ఆఫీస్ PPF ఒక బెస్ట్ ఆప్షన్. ప్రభుత్వ గ్యారంటీతో మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది. 7.1శాతం వడ్డీతో పాటు ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఎలా పొందాలి..? నెలకు రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షలు ఎలా సంపాదించాలనేది తెలుసుకుందాం..
ఈ రోజుల్లో అందరూ పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో డబ్బు పెడుతున్నారు. కానీ పేద, మధ్యతరగతి వారికి రిస్క్ లేకుండా మంచి ఆదాయం కావాలనుకుంటే మాత్రం పోస్టాఫీస్ పథకాలు బెస్ట్. అలాంటి వారి కోసం ప్రభుత్వం తెచ్చిన అద్భుతమైన పథకమే పోస్ట్ ఆఫీస్ PPF. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మీ డబ్బుకి ఎటువంటి డోకా ఉండదు.
PPF అంటే ఏంటీ..? ఎందుకు బెస్ట్..?
PPF పథకం అనేది 15 ఏళ్ల పాటు డబ్బు దాచుకునే దీర్ఘకాలిక ప్లాన్.
వడ్డీ రేటు: ప్రస్తుతం సంవత్సరానికి 7.1% వడ్డీ వస్తుంది. ఈ వడ్డీని ప్రభుత్వమే ఇస్తుంది. కాబట్టి మార్కెట్ రిస్క్ ఏమీ ఉండదు.
ఎంత పెట్టొచ్చు?: మీరు సంవత్సరానికి కనీసం రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఎవరికి బెస్ట్?: చిన్న చిన్న పొదుపు చేసేవారు, భవిష్యత్తు కోసం గ్యారంటీగా డబ్బు కావాలనుకునే మధ్యతరగతి వారికి ఇది పర్ఫెక్ట్.
పన్ను కట్టక్కర్లేదు..
PPF యొక్క అతి పెద్ద లాభం ఏంటంటే.. దీనికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీనిని ‘ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్’ అంటారు:
పెట్టుబడిపై లాభం: మీరు సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు డబ్బు పెడితే, ఆ మొత్తానికి పన్ను మినహాయింపు దొరుకుతుంది.
వడ్డీపై పన్ను లేదు: మీ డబ్బుపై వచ్చే 7.1% వడ్డీకి కూడా పన్ను కట్టక్కర్లేదు.
డబ్బు తీసుకునేటప్పుడు: 15 ఏళ్ల తర్వాత మీరు తీసుకునే మొత్తంపై కూడా పన్ను ఉండదు.
ప్రతి నెలా రూ. 12,500తో రూ. 40 లక్షలు..
ఒకవేళ మీరు ప్రతి నెలా రూ. 12,500 చొప్పున 15 ఏళ్లు పెడితే.. మీ మొత్తం పెట్టుబడి రూ. 22.5 లక్షలు అవుతుంది. వడ్డీగా వచ్చే మొత్తం దాదాపు రూ. 17.47 లక్షలు అవుతుంది. ఇలా మీ చేతికి దాదాపు రూ. 40 లక్షలు వస్తుంది. చిన్న మొత్తంలో పెట్టినా చక్రవడ్డీ వల్ల మీ డబ్బు భారీగా పెరుగుతుంది. అదీ కూడా రిస్క్ లేకుండా.
అవసరమైతే డబ్బు తీసుకోవచ్చా?
PPF కాలపరిమితి 15 ఏళ్లు అయినా, అత్యవసరమైతే డబ్బు తీసుకునే వెసులుబాటు ఉంది.
లోన్: ఖాతా తెరిచిన మొదటి సంవత్సరం తర్వాతే ఖాతా నుండి లోన్ తీసుకోవచ్చు.
డబ్బు తీసుకోవడం: 5 ఏళ్ల తర్వాత కొన్ని షరతులతో అవసరమైన మొత్తాన్ని పాక్షికంగా వెనక్కి తీసుకోవచ్చు.
పన్ను ఆదా కావాలన్నా, భద్రత కావాలన్నా, దీర్ఘకాలంలో స్థిరమైన సంపద నిర్మించాలన్నా, పోస్ట్ ఆఫీస్ PPF పథకం పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యుత్తమ పెట్టుబడి అవకాశం.
































