రాష్ట్రంలోని డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ పరీక్షలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.
నోటిఫికేషన్ విడుదల చేసిన మూడు నెలలకే అంటే మార్చిలోనే డీఎస్సీ పరీక్ష కూడా నిర్వహిస్తామని విద్యాశాఖపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఇందులో భాగంగానే ఈ వచ్చే నెల మూడో వారంలో టెట్ పరీక్ష కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. అంతేకాకుండా ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో టెట్, డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని.. కొత్త డిఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తామన్నారు.
2026 జనవరి లో నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ, స్పెషల్ డిఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్యసాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 78మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యాప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించినట్టు పేర్కొన్నారు.
































