మహిళలూ జాగ్రత్త.. గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే

ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏటా ఏకంగా ఆరు లక్షల మంది మహిళలు కొత్తగా ఈ వ్యాధితో బాధపడుతుండగా..


మూడు లక్షల మంది మరణిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పొలుసుల కణ క్యాన్సర్.. కాగా ఇది గర్భాశయం బయట సన్నని, చదునైన కణాలలో ప్రారంభమవుతుంది. ఇది సాధారణ రకం. కాగా రెండోది చాలా అరుదు. కానీ వేగంగా పెరుగుతుంది. గర్భాశయం లోపల కణాలలో డెవలప్ అయ్యే అడెనోకార్సినోమా చాలా ప్రమాదకరం.

గర్భాశయ క్యాన్సర్‌కు మెయిన్ రీజన్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్(HPV). ఇది శారీరక సాన్నిహిత్యం ద్వారా వ్యాపిస్తుంది. గర్భాశయంలోని కణాల్లో మార్పును తీసుకొచ్చి క్యాన్సర్‌గా మారుతుంది. హెచ్‌పీవీ సంక్రమణ కొన్నిసార్లు దానికదే తగ్గిపోతుంది కానీ కొన్నిసార్లు మాత్రం తీవ్రంగా మారుతుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే శృంగారంలో పాల్గొనే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కరితో కాకుండా ఎక్కువ మందితో సాన్నిహిత్యం ఇందుకు కారణమవుతుంది. ఇలా హెచ్‌పీవీ సంక్రమించే మహిళలతోపాటు ధూమపానం చేసే స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది.

ముందుగా కనిపించే లక్షణాలు

* పీరియడ్స్ టైమ్‌లోనే కాకుండా మధ్యలోనూ, సంభోగం, రుతువిరతి తర్వాత యోని నుంచి అసాధారణ రక్తస్రావం.

* యోని నుంచి దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్. దిగువ వెన్ను భాగంలో నొప్పి, శృంగారం సమయంలో నొప్పిగా అనిపించడం, అలసట, బలహీనతగా అనిపించడం.

* బరువు తగ్గడం, ఆకలి లేకుండా ఉండటం, ఉబ్బరంగా అనిపించడం కూడా కొందరు మహిళల్లో కనిపించే లక్షణాలు. కాళ్లలో నొప్పి, వాపు, మూత్రవిసర్జనలో ఇబ్బంది కూడా ఉండొచ్చు. ఈ సంకేతాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

నివారణ మార్గాలు

* హెచ్‌పీవీ వ్యాక్సిన్ పొందడం మంచిది. ముఖ్యంగా తొమ్మిది నుంచి 26ఏళ్ల వయసు మధ్య తీసుకోవడం ప్రభావవంతంగా ఉంటుంది.

* మూడేళ్లకోసారి పాప్ స్మెర్ టెస్ట్ చేయించాలి.

* సురక్షిత శృంగారం మంచిది.

* ధూమపానం పూర్తిగా మానేయాలి.

* ఆరోగ్యకరమైన ఫుడ్, క్రమం తప్పని వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

* అసాధారణ రక్తస్రావం, నొప్పి లక్షణాలను విస్మరించకూడదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.