AP Govt: ఉద్యోగుల డిమాండ్లపై కదలిక

ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. డీఏ సహా ఇతర ఆర్థికాంశాలపై ఉద్యోగ సంఘాలతో శనివారం సచివాలయంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌, సీఎస్‌ విజయానంద్‌ చర్చిస్తారు. చర్చలకు రావాలని 14 ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రులతో సమావేశంలో ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొననున్నారు. గత కొద్దిరోజులుగా ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎస్‌ సమీక్షిస్తున్నారు. ఉద్యోగుల పెండింగ్‌ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సీఎం సూచించారు. శుక్రవారం ఆర్థిక శాఖ ఈ మేరకు సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించింది. కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చి కొన్ని రోజులే అయినందున రాష్ట్రానికి వచ్చే రాబడిపై అంచనాకు రావడానికి ఇంకొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఉద్యోగులు కూటమి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఉన్నారని, వారి పెండింగ్‌ అంశాలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా బాధితులుగా ఉన్నారని, న్యాయబద్ధంగా వారికి ఇవ్వాల్సిన డబ్బులను కూడా ఇవ్వకుండా వేధించిందని అన్నారు. వారి కష్టాలను కూటమి ప్రభుత్వం గుర్తించిందని, ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు క్రమం తప్పకుండా పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఆర్థికాంశాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చలు జరపాలని మంత్రులు పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్‌, సీఎస్‌ విజయానంద్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగుల ఆర్థికాంశాలపై సానుకూలతతో, వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చర్చలు జరపాలని, చర్చల సారాంశాన్ని తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


గత సర్కారు బకాయిల చెల్లింపు

శనివారం జరగబోయే మంత్రులు, ఉద్యోగ సంఘాల భేటీలో డీఏలపై ఊరట లభించే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగులు తమకు 11వ పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌లో ఉన్న 4 డీఏల్లో 2 డీఏలు చెల్లించాలని కోరుతున్నారు. 2024లో వైసీపీ ఓడిపోయేనాటికి ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.25,000 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ ప్రకటించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ బకాయిల్లో రూ.7,500 కోట్లను చెల్లించారు. అయినప్పటికీ ఈ బకాయిలు ఇప్పుడు రూ.30,000 కోట్లు దాటాయని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం 2024లో ఎన్నికలకు ముందు డీఏ చెల్లింపులకు సంబంధించి పోస్ట్‌డేటెడ్‌ చెక్కుల తరహాలో 2 జీవోలను విడుదల చేసింది. 1-1-2023కు సంబంధించిన డీఏను 2024 మే నెల జీతంలో ఇచ్చేలా, 1-7-2023 డీఏను 2024 ఆగస్టు జీతంతో చెల్లించేలా జీవోలు ఇచ్చి, చెల్లింపులు చేయకుండా చేతులు దులుపుకొంది. ఈ జీవోలను కూటమి ప్రభుత్వం అమలు చేసి ఉద్యోగులకు చెల్లింపులు చేసింది. అలాగే సీపీఎస్‌ ఉద్యోగులకు 7 నెలల మ్యాచింగ్‌ గ్రాంట్‌ రూ.1600 కోట్లను జగన్‌ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఈ ఏడాది జనవరి 11వ తేదీన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు వివిధ బకాయిల కింద రూ.1033 కోట్లను చెల్లించింది. సీపీఎస్‌, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ బకాయిల్లో రూ.6,200 కోట్లను ప్రభుత్వం ఇచ్చింది. ఇటీవల సచివాలయంలోని సీపీఎస్‌ ఉద్యోగులకు బకాయిలు చెల్లించింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా డీఏలు చెల్లించలేదన్న ఆవేదన ఉద్యోగుల్లో ఉంది. దీంతో పాటు హెల్త్‌కార్డులు పెద్ద సమస్యగా మారాయి. ఇలా ఆర్థిక పరమైన, ఆర్థికేతర పెండింగ్‌ సమస్యలపై శనివారం జరగబోయే భేటీలో పరిష్కారం లభించే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.