హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ రమేశ్‌ ప్రమాణం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ దొనాడి రమేశ్‌తో ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌  శుక్రవారం ప్రమాణం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రమేశ్‌ బదిలీకి ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వైవీఎస్‌బీసీ పార్థసారథిÅ చదివి వినిపించారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ డి.రమేశ్‌కు పలువురు న్యాయవాదులు, బంధువులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్, పీపీ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ద్వారకానాథరెడ్డి, ïౖాకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


2023 జులైలో అలహాబాద్‌ హైకోర్టుకు..

జస్టిస్‌ రమేశ్‌ స్వస్థలం ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర్లోని కమ్మపల్లి. అన్నపూర్ణమ్మ, నారాయణనాయుడు దంపతులకు 1965 జూన్‌ 27న జన్మించారు. తండ్రి డీవీ నారాయణనాయుడు పంచాయతీరాజ్‌ శాఖలో ఇంజినీర్‌గా పనిచేశారు. జస్టిస్‌ రమేశ్‌ తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. నెల్లూరు వీఆర్‌ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఏపీ బార్‌ కౌన్సెల్‌లో 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని, హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. జస్టిస్‌ పీఎస్‌ నారాయణ న్యాయవాదిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో జూనియర్‌ న్యాయవాదిగా చేరి వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. 2000 డిసెంబర్‌ నుంచి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాది(జీపీ)గా సేవలందించారు. ఏపీ సర్వశిక్ష అభియాన్‌కు స్టాండింగ్‌ కౌన్సెల్‌గా 2013 వరకు పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ)గా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2020 జనవరి 13న బాధ్యతలు స్వీకరించారు. అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీపై వెళ్లి 2023 జులై 24న అక్కడ బాధ్యతలు తీసుకున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.