అనంత విశ్వంలో ఎన్నో అద్భుతాలు. భూమి, గ్రహాలు, సౌర వ్యవస్థ అన్నీ విశ్వంలో భాగమే. అందులో భాగమైన ఆకాశాన్ని రాత్రి వేళల్లో చూస్తూ చుక్కలను లెక్కపెట్టడం మాటలకు అందని అనుభూతి. అలా చూస్తున్నప్పుడు కొన్నిసార్లు రయ్యున కాంతి పుంజాలు భూమిపైకి దూసుకువస్తున్నట్లు కన్పిస్తాయి. అవే ఉల్కలు. కొన్ని సెకండ్ల పాటు కనిపించే ఈ ఉల్కలు అంబరానికే అందాన్ని తెస్తాయి. అర్ధరాత్రి మెరుస్తూ అద్భుతాన్ని చూపిస్తాయి. అలాంటి సందర్భాల్లో వాటిని అలానే వీక్షిస్తూ మనల్ని మనం మైమరిచిపోతుంటాం.
అచ్చం అలాంటి అనుభూతిని అందించే ఒక ఆసక్తికరమైన దృశ్యం మరికొన్ని రోజుల్లో ఆకాశంలో కనువిందు చేయనుంది. అనేక తోకచుక్కలు ఒకేసారి ఆకాశం నుంచి జారుతూ కన్పించనున్నాయి. ఈ ఉల్కాపాతం అక్టోబర్ 20-21 తేదీలలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా అసలేంటీ ఉల్కాపాతం? ఇది ఎందుకు సంభవిస్తుంది? దీన్ని ఎలా చూడాలి? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.
ఉల్కాపాతం అంటే ఏంటి?: ఉల్కాపాతాలు ఏదో ఒక రకమైన తోకచుక్కకు సంబంధించినవని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. తోకచుక్క అనేది రాతి, ధూళి, మంచు, వాయువులతో తయారైన సౌర వ్యవస్థ వస్తువు. ఇది గ్రహాల మాదిరిగానే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. వాటి నుంచి వెలువడే కణాలు అంతరిక్షంలో తిరుగుతాయి. భూమి తన వార్షిక చలనం (Annual Motion)లో తోకచుక్క మార్గం గుండా వెళ్తున్నప్పుడు భూ వాతావరణంలో ఘర్షణ కారణంగా తోకచుక్క కణాలు కాలిపోతాయి. అందుకే ఆ సమయంలో అవి ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ దృగ్విషయాన్ని ఖగోళ శాస్త్ర పరంగా ఉల్కాపాతం అని పిలుస్తారు. అయితే ఈసారి వచ్చే ఉల్కాపాతం “ఓరియోనిడ్ ఉల్కాపాతం” అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఓరియోనిడ్ ఉల్కాపాతం అంటే?: ఓరియోనిడ్ ఉల్కాపాతం ఒక వార్షిక ఖగోళ సంఘటన. ఇది హాలీస్ తోకచుక్క కారణంగా ఏటా అక్టోబర్ నెలలో జరుగుతుంది. ఈ ఉల్కాపాతం హాలీస్ తోకచుక్క నుంచి దాదాపు 41 మైళ్లు (సెకనుకు 66 కిలోమీటర్లు) వేగంతో వెలువడే ధూళి, శిథిలాల కణాలు భూ వాతావరణంలోకి ప్రవేశించడం వల్ల సంభవిస్తుంది. ఈ హాలీస్ (Halley’s) తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే మళ్లీ ఇది 2101లో భూమిపై కనిపిస్తుంది.
ఇది ఎప్పుడు కన్పిస్తుంది?: ఈ ఓరియోనిడ్ ఉల్కాపాతం అక్టోబర్ నెలలో 2వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 7 వరకు కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 20-21 రాత్రి ఇది గరిష్ఠ- స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో దాదాపు గంటసేపు 10 నుంచి 20 ఉల్కలు కనిపిస్తాయి. అసాధారణ సంవత్సరాల్లో ప్రతి గంటకు 50 నుంచి 75 ఉల్కల గరిష్ఠ రేటును చూడవచ్చు. ఇది ఆగస్టులో సంభవించే పెర్సిడ్ ఉల్కాపాతంతో సమానంగా ఉంటుంది.
దీన్ని ఎలా చూడాలి?: ఈ ఉల్కాపాతాన్ని వీక్షించడానికి ప్రత్యేక ప్రిపరేషన్, పరికరాలు ఏమీ అవసరం లేదు. ఈ అరుదైన దృశ్యాన్ని స్పష్టంగా చూడటానికి తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశానికి వెళ్తే సరిపోతుంది. టెలిస్కోప్ లేకుండానే సాధారణ ప్రజలు ఈ దృగ్విషయాన్ని కంటితో చూడగలరు.
































