టపాసులు కాల్చేటప్పుడు ఈ 7 విషయాలు అస్సల మర్చిపోవద్దు.. లేకపోతే..

దీపావళి అంటే దీపాల వెలుగులు, స్వీట్లు, ముఖ్యంగా టపాసుల సందడి. ఈ దీపాల పండుగ అంటే పిల్లలకు చెప్పలేనంత సంతోషం. వారు ఉత్సాహంగా క్రాకర్లు పేల్చడానికి ఇష్టపడతారు.


ముఖ్యంగా పిల్లలు బాణసంచా కాల్చే విషయంలో, జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. చిన్నపాటి అజాగ్రత్త కూడా తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ దీపావళికి మీరు మీ పిల్లలతో టపాసులు కాల్చడానికి సిద్ధమవుతున్నప్పుడు, ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన 7 ముఖ్యమైన భద్రతా నియమాలను ఇక్కడ తెలుసుకుందాం.

మీరు పాటించాల్సిన 7 నియమాలు:

పెద్దల పర్యవేక్షణ ముఖ్యం: పిల్లలను ఎప్పుడూ ఒంటరిగా టపాసులు కాల్చడానికి అనుమతించవద్దు. ఉత్సాహంలో వారు తప్పులు చేసే అవకాశం ఉన్నందున, ఎల్లప్పుడూ వారి పక్కన ఒక పెద్దవారు ఉండేలా చూసుకోండి. సరదా ఒక్కోసారి పెద్ద ప్రమాదానికి దారతీస్తుంది.

సరైన ప్రదేశం: మండే వస్తువులు, ఎండిన ఆకులు, గడ్డి లేదా బట్టలు లేని బహిరంగ ప్రదేశంలో మాత్రమే బాణసంచా కాల్చండి. బాల్కనీలో లేదా ఇంటి లోపల పేల్చడం చాలా ప్రమాదకరం. ఖాళీ పొలం లేదా ఖాళీ స్థలం ఉత్తమ ఎంపిక.

నీరు – ఇసుక: అవాంఛనీయ ప్రమాదాలను నివారించడానికి ఒక బకెట్ నిండా నీరు.. అలాగే ఇసుకను సిద్ధంగా ఉంచుకోవడం తప్పనిసరి. నిప్పురవ్వలు లేదా చిన్న మంటలు సంభవించిన వెంటనే వాటిని ఆర్పివేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

మంచి దుస్తులు: టపాసులు కాల్చేటప్పుడు పిల్లలకు నైలాన్ లేదా సింథటిక్ బట్టలు కాకుండా త్వరగా మంటలను అంటుకోని కాటన్ దుస్తులు, కొద్దిగా బిగుతుగా ఉండేవి ధరించండి. స్కార్ఫ్‌లు లేదా వదులుగా ఉండే దుస్తులు మంటలను అంటుకునే ప్రమాదం ఉంది.

దూరం పాటించండి: బాణసంచా కాల్చేటప్పుడు లేదా బిగ్గరగా పేలే క్రాకర్లు కాల్చేటప్పుడు పిల్లలను ఎల్లప్పుడూ సురక్షితమైన దూరంలో ఉంచండి. చిచ్చుబుడ్లు వంటి చిన్న బాణసంచా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

నాణ్యమైన క్రాకర్లు: చౌకైన, స్థానిక లేదా నాణ్యత లేని క్రాకర్లను కొనకుండా ఉండండి. మంచి, విశ్వసనీయ దుకాణాల నుండి మాత్రమే కొనుగోలు చేయండి. నాణ్యమైన క్రాకర్లు సురక్షితంగా పేలి, ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మిగిలిపోయిన క్రాకర్లు: పూర్తిగా కాల్చని లేదా మిగిలిపోయిన క్రాకర్లను గమనించకుండా వదిలివేయవద్దు. అవి తరువాత మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుంది. వాటిని నీటిలో నానబెట్టడం ద్వారా లేదా ఇసుకలో పాతిపెట్టడం ద్వారా మాత్రమే పారవేయండి.

ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు, మీ పిల్లలు సురక్షితంగా, సంతోషంగా దీపావళి పండుగను ఆస్వాదించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.