ప్రపంచమే అదిరేలా డెబ్యూ: 10.5 కేజీల బంగారు డ్రెస్, ధర రూ.9.5 కోట్లు

ప్రపంచంలోనే అతి బరువైన బంగారు డ్రెస్‌ను దుబాయ్‌లో ఆవిష్కరించారు. 10.5 కిలోగ్రాముల బరువు, రూ.9.5 కోట్ల విలువ కలిగిన ఈ ‘దుబాయ్ డ్రెస్’ గిన్నిస్ వరల్డ్ రికార్డుల అధికారిక గుర్తింపు పొందింది. సౌదీ అరేబియా ప్రముఖ బంగారు, ఆభరణ బ్రాండ్ అల్ రొమైజాన్ రూపొందించిన ఈ డ్రెస్, 24 క్యారట్ బంగారంతో తయారు చేశారు.


డైమండ్లు, రూబీలు, ఎమరాల్డ్‌లతో అలంకరించిన ఈ బంగారు డ్రెస్, మధ్యప్రాచ్య కళాత్మక డిజైన్‌లతో రూపొందించారు. ఈ డ్రెస్‌ను నాలుగు ప్రధాన భాగాలుగా తయారు చేశారు. 398 గ్రాముల బంగారు టియారా (కిరీటం), 8,810.60 గ్రాముల నెక్లెస్, 134.1 గ్రాముల కళాకృతులు , 738.5 గ్రాముల వెడల్పు ఆభరణం(హియార్). ఇలా.. మొత్తం కలిపి డ్రెస్ బరువు 10.5 కేజీలకు చేరింది.

షార్జాలో జరిగిన 56వ మిడిల్ ఈస్ట్ వాచ్ అండ్ జ్యువెలరీ షోలో ఈ డ్రెస్ ను ఆవిష్కరించారు. ఫ్యాషన్, ఆభరణ, లగ్జరీ రంగాల ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్‌లో, దుబాయ్.. ప్రపంచ లగ్జరీ హబ్‌గా మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఫ్యాషన్‌‌ను కళాత్మక రూపంగా మార్చడమే ఈ డ్రెస్ భావన అని తయారీదారులు చెప్పారు. ఈ డ్రెస్ అమ్మకానికి కాకుండా, యూరప్, ఆసియాలో జరిగే అంతర్జాతీయ ఫ్యాషన్, ఆభరణ ప్రదర్శనల్లో ప్రదర్శించేందుకు రూపొందించినట్టు తెలిపారు. ఈ అద్భుత సృష్టి, సౌందర్యం, సంపద, సాధికారత్వాన్ని సూచిస్తూ, ప్రపంచ ఫ్యాషన్ లోకానికి కొత్త ధోరణిని చూపిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.