కడుపునొప్పని హాస్పిటల్‌కు వెళ్తే.. ఆస్తులు అమ్ముకోవాల్సొచ్చింది

డుపునొప్పి వస్తుందని వైద్యం హాస్పిటల్‌కు వెళ్లగా.. అతన్ని రూ.35లక్షలు పెట్టించేలా చేశారు వైద్యులు ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..


సంగారెడ్డి పట్టణంలో నివాసముండే కడియాల సంగమేశ్వర్ (33) గ్యాస్ సిలిండర్ల ఆటో నడుపుతుంటాడు. జూలై 23న సాయంత్రం సమయంలో కడుపునొప్పి రావడంతో అతను స్థానిక హాస్పిటల్‌కు వెళ్ళాడు. అక్కడ దాదాపు గంటన్నర నిరీక్షించిన తర్వాత.. ఓపి చిట్టి అందించారు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి సంగమేశ్వరుకు చికిత్సలో భాగంగా నాలుగు ఇంజక్షన్లు, రెండు సెలైన్లు ఇచ్చారు. కాసేపటికే సెలైన్ పెట్టిన చోట చర్మం ఎర్రగా మారిందని. ఇదే విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకెళ్తే పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ డాక్టర్ కసురుకున్నాడని.. ఇంటికెళ్లి ఐస్‌ పెట్టుకో తగ్గిపోద్దని కోపంగా చెప్పినట్టు బాధితుడు ఆరోపించాడు.

ఇక చేసేదేమిలేక ఇంటికొచ్చిన బాధితుడు.. డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్‌ వాడాడు. అయినా ఎడమ చేయిపై ఉన్న ఎర్రని మచ్చలు పోకపోవడంతో అతను మరోసారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడు. ఈసారి కూడా డాక్టర్లు ఆయనకు అంతే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి పంపించినట్టు తెలిపాడు. అయితే మరుసటి రోజు తన నోటి నుంచి రక్తం రావడంతో భయపడిన కుటుంబ సభ్యులు తనను మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సంగమేశ్వరను పరీక్షించిన వైద్యులు.. అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని.. గతంలో జరిగిన ట్రీట్మెంట్ కారణంగా ఇన్ఫెక్షన్ అయ్యిందని తెలిపారు. దీంతో సంగమేశ్వరుని అతడి కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకెళ్లారు.

అయితే అక్కడ అతన్ను పరీక్షించిన వైద్యులు తన ఎడమ చేయిను భుజం వరకు తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో సంగమేశ్వర ఒక్కసారిగా షాక్ అయ్యాడు.. తాను కష్టం చేసుకుని బతికేవాడినని.. చేయి తొలగిస్తే తన జీవితం ఆగమవుతుందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి యశోద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ కూడా దాదాపుగా ఇలాంటి సమాధానమే వినిపించింది. కానీ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు చేయి తొలగించకుండానే చికిత్స ప్రారంభించిన డాక్టర్లు… ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని పూర్తిగా తీసేశారు. దాదాపు రెండు నెలల పాటు ఆసుపత్రిలో ఉన్న సంగమేశ్వర్.. చికిత్స కోసం రూ. 35 లక్షల వరకు ఖర్చు అయింది. హాస్పిటల్‌ ఖర్చుల కోసం సంగమేశ్వర్ తన ఇంటిని కూడా అమ్మకోవాల్సి వచ్చింది.

చికిత్స పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత.. సంగమేశ్వర్ అతను మొదట వైద్యం కోసం వెళ్లిన ఆసుపత్రి సూపరింటెండెంట్ ను కలిసారు. తనకు న్యాయం చేయాలని విన్నవించాడు. ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా చేసిన ట్రీట్మెంట్ కారణంగానే తన జీవితం ఆగమైందని సంగమేశ్వర్ ఫిర్యాదు చేశాడు. కానీ ఇప్పటివరకు సూపరింటెండెంట్ కనీస భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదని బాధితుడు చెప్తున్నాడు. రిపోర్టులన్నీ పరిశీలించి… “నువ్వు బతికి రావడమే గొప్ప, ఎందుకు అనవసరంగా తిరుగుతావు” అంటూ కోప్పడ్డారని సంగమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.