సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు ప్రిన్స్ మహేశ్ బాబు బావ హీరో సుధీర్ బాబు కుమారులు నటన రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పెద్ద కొడుకు చరిత్ మానస్ భలే భలే మగాడివోయ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే చరిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
త్వరలో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని టాక్ . ఇక సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ ఆల్రెడీ అడివి శేష్ గూఢచారి, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. దర్శన్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
అయితే ఇప్పుడు దర్శన్ ఓ పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఫౌజీ. 1930ల కాలంలో స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నాటి కథా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రి మూవీస్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, యలమంచలి రవి నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి అనే డెబ్యూ భామ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ చిన్నప్పటి రోల్ లో దర్శన్ నటించబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా దర్శన్ తండ్రి సుధీర్ బాబు తెలిపాడు. అయన హీరోగా నటించిన జటాధరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ కీలక అప్డేట్ ప్రకటించాడు సుధీర్. తాత సూపర్ స్టార్ కృష్ణ, మేనమామ మహేశ్ బాబులా దర్శన్ రాబోయే రోజుల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం.



































