కర్నూలు జిల్లాలో రైతులు బొప్పాయి సాగుతో పాటు, దాని పాల సేకరణ ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. చాగలమర్రి మండలంలో విత్తనం నాటిన తొమ్మిది నెలలకు పండే బొప్పాయి పండ్లను సేకరిస్తారు.
చాగలమర్రి మండలంతో పాటు, చిన్నవంగలి, వైఎస్సార్ కడప జిల్లాలోని కానగూడూరు, క్రిష్ణంపల్లె గ్రామాల్లో సుమారు 1200 ఎకరాల్లో రైతులు బొప్పాయిని సాగు చేస్తున్నారు. విత్తనం వేసిన తొమ్మిది నెలల తర్వాత బొప్పాయి పండ్లు చేతికొస్తాయి. పండ్ల సేకరణ పూర్తయిన తర్వాత, మరో మూడు నెలలు ఆగి, అంటే పంట చేతికొచ్చిన 13 నెలల తర్వాత, మిగిలిపోయిన లేదా ముదిరిన కాయల నుంచి పాలను సేకరిస్తారు.
ఈ పాల సేకరణ ప్రక్రియ చాలా సులభం.. తెల్లవారుజామున, సూర్యోదయానికి ముందే బొప్పాయి కాయలకు గాట్లు పెడతారు. ఇలా చేస్తే కేవలం రెండు గంటల్లోనే కాయల నుంచి తెల్లటి పాలు ఊరుతాయి. ఈ పాలను స్థానిక రైతుల నుంచి రాయచోటి, రాజంపేట ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం, 20 లీటర్ల బొప్పాయి పాలు రూ.6 వేల ధర పలుకుతున్నాయి. పాల సేకరణ ద్వారా రైతులకు మంచి ఆదాయం వస్తోంది. ఎకరాకు సుమారు 3 నుంచి 4 డ్రమ్ముల పాలు సేకరించవచ్చు. దీని ద్వారా ఎకరాకు పాల సేకరణ నుంచే రైతుకు రూ.24 వేల వరకు ఆదాయం లభిస్తుంది. ఇలా లక్షల్లో ఆదాయం వస్తుంది.
ఈ బొప్పాయి పాలను వివిధ పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మందులు, కాస్మోటిక్స్, సబ్బుల తయారీలో వీటిని వాడుతున్నారు. అంతేకాకుండా, నాణ్యతను బట్టి బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు, కొన్నిసార్లు విదేశాలకు కూడా ఈ పాలను ఎగుమతి చేస్తున్నారు. బొప్పాయి సాగులో ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ పాల సేకరణ ఒక అదనపు ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో రైతులు బొప్పాయి పాలతో ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ వినూత్న ఆలోచన రాష్ట్రంలో ఎంతోమంది రైతులకు ఆదర్శంగా మారుతుందని భావిస్తున్నారు.
































