రేపు తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలు బంద్

ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు(అక్టోబర్ 30) విద్యా సంస్థల బంద్ కు SFI పిలుపునిచ్చింది.


రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, ప్రొఫెషనల్ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు బంద్ కానున్నాయి. బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్ లు ఇవ్వాలని SFI రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ ఇటీవల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సర్టిఫికెట్ల కోసం ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని నాగరాజ్ కోరారు. అన్ని కాలేజీలు బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా పలు కాలేజీలు రేపు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఇక మొంథా తుపాను కారణంగా సిద్ధిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించారు. చిన్నారుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. హన్మకొండ, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హన్మకొండ, ములుగు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. రెబర్తిలో 17.4, దూల్మిట్టలో 15.9, చేర్యాలలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వివరించారు. అలాగే వరంగల్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పర్వతగిరిలో 34.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

అలాగే వరంగల్‌, హన్మకొండ జిల్లాలకు మరో 24 గంటలు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు అధికారులు. రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారుల సూచనలు చేశారు. వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో NDRF బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు చేపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్రంలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జనగామ, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌ , సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ వాతావరణ శాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.