Heavy Rains Lash Telangana: మొంథా మోత

  • వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో దంచికొట్టిన వాన
  • పొంగిన వాగులు, వంకలు.. జలదిగ్బంధంలో మారుమూల గ్రామాలు
  • వర్షాలకు ఇద్దరి మృతి.. వరదలో వ్యాన్‌ డ్రైవర్‌ గల్లంతు
  • పంటనష్టంతో అన్నదాతల గుండె చెరువు.. ఒరిగిన వరి.. తడిసిన పత్తి
  • పలు రైళ్ల రద్దు.. కొన్ని దారిమళ్లింపు.. 25 స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు
  • అవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు.. దక్షిణమధ్య రైల్వే అధికారుల సూచన
  • శంషాబాద్‌లో విమానాల రాకపోకలకు అంతరాయం
  • వరంగల్‌ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం
  • శ్రీశైలం-హైదరాబాద్‌ హైవేలో కోతకు గురైన వంతెన.. రాకపోకలు బంద్‌
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. రైతాంగం నష్టపోకుండా చూడాలి
  • చెరువులు, కుంటల్లో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి
  • అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలి.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
  • మొంథా తుపాను ప్రభావంతో బుధవారం హైదరాబాద్‌ సహా వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. మరికొన్ని జిల్లాల్లో కూడా వానలు కురిశాయి. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరి, పత్తి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో పైరు నేలకొరిగింది. కోతకోసి రోడ్లమీద, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయింది. చేలల్లో మొక్కల మీదే పత్తి తడిసి.. నల్లబారుతోంది. వరంగల్‌ జిల్లా కల్లెడలో ఎనిమిదన్నర గంటల వ్యవధిలో 34సెం.మీ వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం బిలిజపూర్‌లో 15.9 సెం.మీ, నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో 11.7 సెం.మీ, జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో 23.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం-బొల్లెపల్లి, బీబీనగర్‌ మండలం రుద్రవల్లి-జూలురు లోలెవల్‌ వంతెనలపై నుంచి నాలుగు అడుగుల ఎత్తులో మూసీ పరవళ్లు తొక్కుతోంది. భువనగిరి, బీబీనగర్‌, వలిగొండ, చౌటుప్పల్‌ మండలాల్లోని పలు గ్రామాలకు మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఏడుచోట్ల 20-30 సెం.మీ మేర వర్షపాతం నమోదైంది.

    జనగామ జిల్లా జనగామ-హుస్నాబాద్‌ మార్గంలో గానుగపహాడ్‌ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని ఽకొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో శివారు కాలనీల్లోని ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దుందుభి, చంద్రసాగర్‌ నదులు ఉప్పొంగి ప్రవహించడంతో దాదాపు 20 గ్రామాలకు రవాణా స్తంభించిపోయింది. శ్రీశైలం- హైదారాబాద్‌ జాతీయ రహదారిలోని లత్తిపూర్‌ సమీపంలోని డిండి ప్రాజెక్టు అలుగు వద్ద వంతెన కోతకు గురైంది. ఆ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద పెరగడంతో దిగువకు నీళ్లు వదిలారు. హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ నుంచి మొత్తంగా 6,203 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్‌లో రోజంతా వర్షం పడింది. కొన్నిచోట్ల రోడ్ల మీద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మూసీకి ప్రవాహం పెరుగుతుండటంతో పరీవాహక ప్రాంతవాసులను హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. చాదర్‌ఘాట్‌ వంతెనకు దాదాపు అనుకుంటూ వరద ప్రవహిస్తోంది. మలక్‌పేట ఆర్‌యూబీ వద్ద భారీగా నీరు చేరడంతో మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.

    రైళ్ల రద్దు.. దారి మళ్లింపు

    భారీ వర్షాలు, వరదల కారణంగా సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం రూట్లలో పలు రైళ్లను రద్దు చేసినట్లు.. కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇంటర్‌సిటీ, ఈస్ట్‌కోస్ట్‌ రైళ్లను వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. కృష్ణా ఎక్స్‌ప్రె్‌సను మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో, గోల్కొండ ఎక్స్‌ప్రె్‌సను డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. (12705 /06) గుంటూరు-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, అప్‌ అండ్‌ డౌన్‌ (6778) విజయవాడ-డోర్నకల్‌ ప్యాసింజర్‌, (67766) డోర్నకల్‌-కాజీపేట, (07001) చర్లపల్లి-తిరుపతి అప్‌అండ్‌ డౌన్‌, రైళ్లు బుధ, గురువారాల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (12131) దాదర్‌ -సాయినగర్‌ల మధ్య షిర్డీ ఎక్స్‌ప్రె్‌సను కాజీపేటలో నిలిపివేసి తిరిగి సికింద్రాబాద్‌ పంపించారు. కాజీపేట రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రయాణికుల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లోని కొర్లకుంట(మారెమ్మకుంట), బ్రహ్మణకుంటలను పూడ్చి వాటిలో వెంచర్లు వేయడంతో వర్షపునీరు బయటకు పోయే దారిలేక రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం, రైల్వే యార్డుల మీదుగా వరద నీరు ప్రవహించింది. సిక్‌ వ్యాగన్‌షెడ్డులోకి వరదనీరు చేరడంతో పనులు నిలిచిపోయాయి.

    రైల్వేస్టేషన్‌లో పట్టాలు నీట మునగడంతో గోల్కొండ ఎక్స్‌ప్రె్‌సను స్టేషన్‌లోనే రైల్వే అధికారులు గంటల తరబడి నిలిపివేశారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ రైల్వే లైన్‌పై ప్లాట్‌ఫాం ఎత్తు వరకు వరదనీరు చేరడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపించింది. డోర్నకల్‌, గుండ్రాతిమడుగు, మహబూబాబాద్‌, తాళ్లపూసపల్లి స్టేషన్‌లలో రైళ్లు గంటలతరబడి నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులకు పోలీసులు నీళ్ల సీసాలు, బిస్కెట్‌ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందజేశారు. మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆగిన కృష్ణ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో నిలిచిన కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం మళ్లీ వెనక్కి మళ్లించారు. ముఖ్యమైన 25 స్టేషన్లలో హెల్ప్‌డె్‌స్కలు ఏర్పాటు చేశారు. అవసరమైతే తప్ప రైలు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ద.మ రైల్వే అధికారులు సూచించారు.

    గురుకుల విద్యార్థులకు ఎంత కష్టమో!

    నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి ఎస్టీ గురుకుల పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. కొమ్మేపల్లి గురుకుల పాఠశాల లోతట్టు ప్రాంతం, పొలాల మధ్యన ఉండటంతో పాఠశాల ఆవరణలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. విద్యార్థులను వరద నీరు మధ్యలో నుంచే తాడు సాయంతో దాటించి, ప్రత్యేక వాహనాల్లో పెంచికల్‌పహడ్‌ బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలోకి తరలిచారు.

    విమాన సర్వీసుల రద్దు

    భారీ వర్షాల కారణంగా శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విజయవాడ, వైజాగ్‌ వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు. శంషాబాద్‌ నుంచి ఉదయం 7గంటలకు బయల్దేరిన ఐఎక్స్‌ 2885 ఎయిరిండియా విమానం వైజాగ్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌కు తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. మళ్లీ వెళ్లడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు. విజయవాడ వెళ్లాల్సిన 6ఈ7401 విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరేందుకు సిద్ధమైనా.. విజయవాడలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరిన్ని కొన్ని విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.