ఆ మ్యాచ్ విన్నర్‌పై వేటు.. సౌతాఫ్రికాతో ఫైనల్ ఆడే భారత మహిళల తుది జట్టు ఇదే

హిళల వన్డే ప్రపంచకప్ 2025 ట్రోఫీకి టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. అర్థ శతాబ్దంగా అందని ద్రాక్షగా మిగిలిన ఐసీసీ టైటిల్‌ను అందుకునేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు సిద్దమైంది.


ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో అసాధారణ తెగువ కనబర్చిన భారత్.. అదే జోరును ఫైనల్లో కొనసాగిస్తే మహిళల క్రికెట్‌లో సరికొత్త చరిత్రను లిఖించనుంది.

బలబలాల పరంగా ఇరు జట్లు సమంగా కనిపిస్తున్నా..లీగ్ దశలో భారత్‌పై సౌతాఫ్రికానే పైచేయి సాధించింది. అనవసరం తప్పిదాలతో ఆ మ్యాచ్‌లో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. కానీ ఫైనల్ జరిగే నవీ ముంబైలోనే టీమిండియా వరుసగా మూడు మ్యాచ్ ఆడటం హర్మన్‌సేనకు కలిసొచ్చే అంశం.

రాధా యాదవ్‌పై వేటు..

ఫైనల్ బరిలోకి దిగే భారత కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. 6 బౌలింగ్ ఆప్షన్స్‌.. 8 బ్యాటింగ్ ఆప్షన్స్‌తో విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించనుంది. కానీ సెమీఫైనల్లో దారుణంగా విఫలమైన రాధా యాదవ్‌ను తప్పించే అవకాశం ఉంది. ఆమె స్థానంలో స్నేహ్ రాణా తుది జట్టులోకి రానుంది. ఈ టోర్నీలో సౌతాఫ్రికా స్పిన్నర్లకే ఎక్కువగా తడబడింది. అంతేకాకుండా సెమీస్ సౌతాఫ్రికా ఒక్క లెఫ్టార్మ్ బ్యాటర్ లేకుండా బరిలోకి దిగింది. కాబట్టి భారత్ రాధా యాదవ్‌నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అంజు చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఈ ఒక్క విషయంలో మినహా మిగతా లైనప్‌లో ఎలాంటి మార్పు చేసే అవకాశం లేదు.

టాపార్డర్‌లో మార్పుల్లేవ్..

ప్రతీకా రావల్ స్థానంలో జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ సెమీస్‌లో విఫలమైనా.. ఫైనల్లో కొనసాగించే ఛాన్స్ ఉంది. స్మృతితో కలిసి ఓపెనింగ్ చేయనుంది. జెమీమా, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ మిడిలార్డర్‌లో ఆడనుండగా.. రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్‌లతో 8వ స్థానం వరకు భారత్‌కు బ్యాటింగ్ బలం ఉంది. కానీ లోయరార్డర్‌పై ఆధారపడకుండా టీమిండియా బ్యాటర్లు రాణించాలి. ధారళంగా పరుగులిస్తున్నా.. క్రాంతి గౌడ్‌ను జట్టులో కొనసాగించనున్నారు. పవర్ ప్లేలో ఆమె కీలకం కానుంది. ఆమెతో పాటు రేణుకా సింగ్, అమన్ జోత్ కౌర్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. దీప్తి శర్మ, శ్రీ చరణి, రాధా యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.

భారత్ తుది జట్టు(అంచనా) : 1. స్మృతి మంధాన, 2 షఫాలీ వర్మ, 3 జెమిమా రోడ్రిగ్స్, 4 హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), 5 దీప్తి శర్మ, 6 రిచా ఘోష్ (వికెట్ కీపర్), 7 అమన్‌జోత్ కౌర్, 8 రాధా యాదవ్/స్నేహ్ రాణా, 9 క్రాంతి గౌడ్, 10, శ్రీ చరణి, 11 రేణుక సింగ్.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.