ఏపీలో కొత్త క్యాన్సర్ సెంటర్.. 4 వేల మందికి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో 480 మిలియన్ డాలర్ల వ్యయంతో అనగా 4,800 కోట్ల పెట్టుబడితో చన్ జాంగ్ యున్ చల్లా క్యాన్సర్ సెంటర్ ను నెలకొల్పనుంది .ఇందులో భాగంగా విజయవాడ గుణదల లోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ఐదు భాగస్వామ్య కంపెనీలతో చల్లా గ్రూపు వారు ఎం వో యు లు చేసుకున్నారు.


అనంతరం వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం అధ్యక్షులు పీటర్ చున్ మాట్లాడుతూ చన్ జాంగ్ యున్ క్యాన్సర్ సెంటర్ ను చెన్నైలో ఇప్పటికే ప్రారంభించామని అక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. క్యాన్సర్ సెంటర్ విస్తరణలో భాగంగా మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ను సైతం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్న సమయంలో చల్లా గ్రూప్స్ అధినేత చల్లా ప్రసాద్ సూచన మేరకు తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సేవలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో 480 మిలియన్ డాలర్స్ అనగా 4800 కోట్ల రూపాయల వ్యయంతో అతిపెద్ద క్యాన్సర్ సెంటర్ను నెలకొల్పనున్నట్లు ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాన్సర్ సెంటర్ కు సంబంధించిన అన్ని అనుమతులు ఇచ్చిన అనతి కాలంలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వివరించారు. క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 4000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు.

క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించి ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తామని ప్రకటించారు. ఒమెక్సా బయాలజీస్ , ఎమ్ ఎ సి ఈ, చల్లా గ్రూప్, ఐ హోల్డింగ్ కంపెనీల భాగస్వామ్యం తో క్యాన్సర్ సెంటర్ ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. క్యాన్సర్ సెంటర్ నిర్మాణం అనంతరం మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ , ఫ్రీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఐ, డేటా సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ఆంధ్ర రాష్ట్రంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు ఐదు కంపెనీలు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.అనంతరం చల్లా గ్రూప్ అధినేత చల్ల ప్రసాద్ మాట్లాడుతూ తాను తనకు జన్మనిచ్చిన ప్రాంతంలో సౌత్ కొరియా కు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం సహకారంతో చన్ జాంగ్ యున్ క్యాన్సర్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు జిల్లా మరియు తెలుగు రాష్ట్రాల లోని పేదలకు ఈ క్యాన్సర్ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న నిరంతర శ్రమ ప్రశంసనీయమన్నారు. ఇందులో భాగంగా తాను క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే మరిన్ని అంతర్జాతీయ స్థాయి కంపెనీల తో కలసి మరిన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగినది.

తదనంతరం ఓమెక్సా కంపెనీ ఫౌండర్ డాక్టర్ రాజన్ గార్గ్, ఉపాధ్యక్షుడు సుధీర్ పూర్ మాట్లాడుతూ చన్ జాంగ్ యుంగ్ క్యాన్సర్ సెంటర్లో ఒమెక్సా బయో టెక్నాలజీస్ తరపున క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, క్యాన్సర్ గడ్డల తొలగింపు నిర్వహణ చేస్తామన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ క్యాన్సర్ సెంటర్ ను నిర్మిస్తున్నారని, పేద ప్రజలకు ఈ క్యాన్సర్ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని వారు వివరించారు. విలేకరుల సమావేశంలో కన్సోల్ పార్ట్నర్ ఇన్ ఇండియా కంపెనీ ప్రతినిధి గ్యారీ చోప్రా, ఎమ్ ఎ సి ఈ ప్రతినిధి జోసెఫ్ మాథ్యూ , చల్లా గ్రూప్ సౌత్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ పోలిన సుబ్బారావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.