రుచి కొంచెం వెగటుగా ఉండటం వల్ల చాలా మంది ముల్లంగిని తినడానికి ఇష్టపడరు. కానీ ఆరోగ్య పరంగా చూస్తే ముల్లంగి శరీరానికి ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది.
ముఖ్యంగా శీతాకాలంలో దీని ప్రయోజనాలు మరింతగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజువారీ ఆహారంలో ముల్లంగిని తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
ముల్లంగిలో పొటాషియం, పీచు, జింక్, భాస్వరం, మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అదనంగా ఎ, బి6, సి, ఇ, కె విటమిన్లు కూడా ఎక్కువగా లభిస్తాయి.
ముల్లంగి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణవ్యవస్థ మెరుగుదల: ముల్లంగిలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
రోగనిరోధక శక్తి పెంపు: విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, శీతాకాల వ్యాధులు దూరంగా ఉంటాయి.
గుండెకు రక్షణ: ముల్లంగిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
కంటి చూపు, ఎముకల బలం: ముల్లంగిలోని పోషకాలు కంటి చూపును మెరుగుపరచి, ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తాయి.
కూర, చారు, పచ్చడి లేదా సలాడ్ రూపంలోనైనా ముల్లంగిని తీసుకోవచ్చు. రుచికి కొంచెం వెగటుగా ఉన్నా, ఆరోగ్యానికి మాత్రం ఇది ఒక సంపూర్ణ ఆహారమని వైద్యులు చెబుతున్నారు. శీతాకాలంలో ముల్లంగిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు సహజంగా లభిస్తాయి
































