విద్యా విధానంలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలోని ఆరు పరీక్షలను ఐదింటికి కుదించింది. ఈ నేపధ్యంలో సబ్జెక్టుల మార్కులు మారాయి.
ఎంపీసీ గ్రూపు(MPC Group)నకు సంబంధించి మొత్తం మార్కులు 500. రాత పరీక్షలకు 470, ప్రాక్టికల్స్ (కెమిస్ర్టీ 15-ఫిజిక్స్ 15) 30 మార్కులు. ఇప్పటి వరకు మ్యాథ్స్ సబ్జెక్టును రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. పేపర్ 1ఏకి 75 మార్కులు, పేపర్ 1బికి 75 మార్కులు మొత్తం 150 మార్కు లతో పరీక్షలు జరగేవి. ఇకపై 100 మార్కులతో ఒకే పేపరు నిర్వహిస్తారు. పాస్ మార్కులు 35. ఫిజిక్స్ 85, కెమిస్ర్టీ 85, ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్‌కు వంద మార్కులు చొప్పున రెండు పరీక్షలు నిర్వహిస్తారు.
బైపీసీ గ్రూపులో మార్కులు మొత్తం 500, రాత పరీక్షలకు 455, ప్రాక్టికల్స్ (కెమిస్ర్టీ 15, ఫిజిక్స్ 15+బోటనీ, జువాలజీ 15) మొత్తం 45 మార్కులు. బోటనీ 60 మార్కులకు, జువాలజీ 60 మార్కులకు రెండు పేపర్లు ఉండేవి. ఇపుడు ఈ రెండు కలిపి 85 మార్కులుగా ఒకే ప్రశ్నాపత్రంగా ఇస్తారు. ఆన్సర్ షీట్లు మాత్రం రెండుగా ఉంటాయి. బోటనీ 43 మార్కులు, జువాలజీ 42 మార్కులుగా ప్రశ్నలు ఉంటాయి. ఉత్తీర్ణత 29.5 మార్కులుగా నిర్ధారించారు. కానీ అరమార్కు ఉండదు. 29 మార్కులు వస్తే ఉత్తీర్ణతగా తీసుకుంటారు. ఫిజిక్స్ 85కి, కెమిస్ర్టీ 85 మార్కులకు ఉంటుంది. ఫస్ట్, సెకండ్ లాంగ్వేజీలకు వంద మార్కుల చొప్పున పరీక్ష పత్రాలు ఇస్తారు. ఈ విధానంలో ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులు సెకండ్ ఇయర్‌లోను కొనసాగిస్తారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పాత విధానంలోనే ప్రశ్నపత్రాలు ఉంటాయి.
కళాశాలలు, విద్యార్థుల వివరాలు
2025-26 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 151 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 17600 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు పొందారు. అందులో 7957 మంది బాలురు, 9643 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ కళాశాలలు, ప్లస్ 2 కళాశాలల్లోని విద్యార్థులకు ప్రశ్నపత్రాలపై అవగాహన పెంచేందుకు ఒరియంటల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రశ్న పత్రాలు రూపకల్పన చేసి వాటి విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యా ర్థుల్లో ఉత్తీర్ణత పెంచే దిశగా విద్యాబోధన జరుగుతోంది.
– జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 20 ఉన్నాయి. వీటిలో 2837 మంది విద్యార్థులు చేరగా, అందులో 1086 మంది బాలురు, 1751 మంది బాలికలు ఉన్నారు.
– హెచ్‌ఎస్‌ప్లస్ (హయ్యర్ సెకండరీ ప్లస్) విభాగంలో 9 కళాశాలల్లో 217 మంది బాలికలు మాత్రమే చేరారు. అలాగే జిల్లాలోని 17 కేజీబీవీ (కస్తూర్బాగాంధీ బాలికా విద్యాల యాలు)ల్లో 567 మంది బాలికలు ప్రవేశించారు.
– మోడల్ స్కూళ్లలోని మూడు కళాశాలల్లో 202 మంది విద్యార్థులు (31 మంది బాలురు, 171 మంది బాలికలు) అడ్మిషన్లు పొందారు.
– జిల్లాలోని ఐదు ఎయిడెడ్ కళాశాలల్లో 352 మంది (270 మంది బాలురు, 82 మంది బాలికలు) చేరారు.
– జిల్లా వ్యాప్తంగా 79 ప్రైవేట్ జూనియర్ కళా శాలల్లో 12,316 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. వీరిలో 6142 మంది బాలురు, 6174 మంది బాలికలు ఉన్నారు.
– జిల్లాలోని 11 సోషియల్ వెల్ఫేర్ కళాశాలల్లో 634 మంది విద్యార్థులు (191 మంది బాలురు, 443 మంది బాలికలు) ఉన్నారు.
– జిల్లాలో 7 కళాశాలల్లో ఒకేషనల్ కోర్సుల్లో 475 మంది విద్యార్థులు (237 మంది బాలురు, 238 మంది బాలికలు) ఉన్నారు.
జాతీయస్థాయిలో ఒకే విధానం
జాతీయస్థాయిలో ఒకే విధానం అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విధానం ద్వారా విద్యార్థులు జాతీయస్థాయి పోటీల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. సిలబస్ తగ్గించడం ద్వారా సలువుగా ఉత్తీర్ణత సాధిస్తూ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.



































