ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..
రేషన్ షాపులను మరింత బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల కోసం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. జనవరి 1వ తేదీ నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీని ప్రారంభించనుంది.
ముఖ్యంగా పట్టణ నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన గోధుమ పిండిని చౌకగా అందజేయడం దీని ఉద్దేశం. ఈ పంపిణీ కోసం తొలి దశలో 2400 మెట్రిక్ టన్నుల గోధుమ పిండిని సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ గోధుమ పిండిని కిలో 18 రూపాయల చొప్పున రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో గోధుమ పిండి ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, ప్రభుత్వం అందించే ఈ తక్కువ ధర పట్టణ లబ్ధిదారులకు ఊరట కలిగించనుంది.
సరసమైన ధరకే పిండిని అందుబాటులో ఉంచడం ద్వారా ఆహార భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించింది. లబ్ధిదారులకు పంపిణీ సజావుగా జరిగేలా పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. దీనికోసం మొత్తం 2, 400 మెట్రిక్ టన్నులు గోధుమపిండిని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. కౌలు రైతులకు 50,000 టార్పాలిన్లను కూడా పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు కోసం ఆరు కోట్ల గోనె సంచులు అందుబాటులోకి తీసుకుని రానుంది.
అలాగే- ధాన్యం విక్రయించిన రైతులకు అదే రోజు డబ్బు వారి ఖాతాలో జమ చేయనుంది. మరోవంక- స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఇదివరకే తొమ్మిది జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ జరిగింది.
































